యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడే కానీ, అతడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి దగ్గరి బంధువు అనే విషయం మీకు తెలుసా? అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. తలైవా భార్య లతా రజినీకి అనిరుధ్ మేనల్లుడు అవుతాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతగాడు.. ఇప్పుడు దేశంలోనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు.

తనకు కొడుకు లేకపోవడం వల్ల.. అనిరుధ్‌ని ఒక సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు రజినీకాంత్. ఇదే విషయాన్ని జైలర్ ఆడియో ఫంక్షన్‌లో దర్శకుడు విఘ్నేష్ చెప్పుకొచ్చాడు. జైలర్‌లో తాను తండ్రి ,కొడుకులు అనుబంధం గురించి తాను ఒక పాట రాశానని, అందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానన్నాడు. తాను రజనీ సార్ కోసం ఆ పాట రాసినప్పుడు అనిరుధ్‌లో నిజాయితీ, ప్రేమ కనిపించాయన్నాడు. అనిరుధ్ కారణంగా రజినీ సార్‌కి కొడుకు లేడని సమస్య తీరిపోయిందన్నాడు. తలైవా పట్ల అనిరుధ్‌కి ఉన్న అభిమానం, ప్రేమను చూస్తే.. ఒకవేళ రజినీకి కొడుకు ఉంటే, వారి బంధాన్ని చూసి అతడు కచ్ఛితంగా అసూయపడేవాడేమో అనే విధంగా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

కాగా.. తమిళ నటుడు రవి రాఘవేంద్ర కొడుకు అయిన అనిరుధ్, 3 సినిమాలో ‘కొలవెరీ డీ’ పాటతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి అతనికి తిరుగులేకుండా పోయింది. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇతర భాషల్లోనూ ఇతనికి ఫుల్ గిరాకీ వచ్చిపడింది. ఇదిలావుండగా.. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీకాంత్ ఓ షూటింగ్‌లో ఉన్నప్పుడు, ఆయన భార్య లతా ఆ షూటింగ్ స్పాట్‌కు తనతో పాటు అనిరుధ్‌ని తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో రజినీ, అనిరుధ్ కలిసి దిగిన ఫోటో.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.