ప్రస్తుతం సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటున్న పేరు రాజ్ తరుణ్. వ్యక్తిగత వ్యవహారాల నడుమ వివాదాస్పదంగా మారిన రాజ్ తరుణ్ ని చూసి, ఆయన నిర్మాతలు ఇదే సరైన సమయం అనుకొని సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా నేడు ఆయన హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ అనే చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.
కథ :
మల్టీ మిలీనియర్ ఆదిత్య రామ్ (మురళి శర్మ) కుమారుడు రచిత్ రామ్ (రాజ్ తరుణ్). చిన్నప్పటి నుండి లండన్ లో విద్యాబ్యాసం చేసి ఇండియా కి తిరిగి వస్తాడు. ఇండియా కి రాగానే రచిత్ రామ్ ని తన వ్యాపార సామ్రాజ్యానికి సీఈఓ చెయ్యాలని అనుకుంటాడు ఆదిత్య రామ్. కానీ ఈ ప్రతిపాదనకు రచిత్ రామ్ పెద్దమ్మ వసుందర (రమ్యకృష్ణ) అడ్డుపడుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ గా బాధ్యతలు చేపట్టే ముందు ఏదైనా గ్రామం లో 100 రోజులపాటు అజ్ఞాతవాసం చెయ్యాల్సి ఉంటుంది.
దీంతో రచిత్ రామ్ తన సమర్థతను నిరూపించుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని కడియం సమీపం లో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి వస్తాడు. అక్కడ ఆయన ఒక రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమం లో రచిత్ రామ్ కి ఎన్నో రకాల సంఘటనలు, సమస్యలు ఎదురు అవుతాయి. అవి ఆయనలో గొప్ప చైతన్యం ని తీసుకొస్తుంది. అదే సమయం లో ఆ పల్లెటూరిలో ఉన్న పూల రైతులకు సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్య కోసం రచిత్ రామ్ ఎలాంటి పోరాటం చేసాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
కథ మొత్తం విన్న తర్వాత మీ అందరికీ శ్రీమంతుడు, బిచ్చగాడు వంటి చిత్రాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. దర్శకుడు టేకింగ్ లో కూడా ఏ మాత్రం కొత్తదనం లేకుండా అలా కానిచ్చేశాడు. సాధారణంగా ఒకే తరహా స్టోరీ లైన్ తో సినిమాలు రావడం మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ టేకింగ్ కొత్తగా తమ స్టైల్ లో దర్శకులు తీస్తూ ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చోబెట్టి బ్లాక్ బస్టర్లు కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అదే మిస్ అయ్యింది. అంతే కాకుండా ఈ చిత్రం రాజ్ తరుణ్ కి కాకుండా, కాస్త మాస్ ఇమేజి ఉన్న హీరోకి పడుంటే బాగుండేది అని అనిపించింది.
ఎందుకంటే ఆయన ఇమేజీకి మించిన ఫైట్స్, ఎలివేషన్స్ ఆడియన్స్ కి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంటర్టైన్ గా ఉంటుంది. ఇంటర్వెల్ సన్నివేశం పర్వాలేదు అనిపించింది. పూల రైతుల కోసం పోరాటం చేసే సన్నివేశాలు వచ్చేంతవరుకు చాలా స్లో గా సినిమా నడుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ, అక్కడి నుండి స్క్రీన్ ప్లే లో వేగం అందుకుంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్ కథ పూర్తిగా దారి తప్పుతుంది. ఇక చివర్లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఎప్పటిలాగానే ఈ పాత్రలో కూడా చాలా సహజంగా నటించాడు. కానీ లవ్ స్టోరీస్, కామెడీ మూవీస్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరించే రాజ్ తరుణ్ కి ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ ఎలివేషన్లు, ఫైట్స్ పెట్టడంతో ఆడియన్స్ కి ఇతనికి ఇంత అవసరమా అనే అనుభూతి కలుగుతుంది. ఈ చిత్రం ద్వారా హాసిని సుధీర్ అనే అమ్మాయి ఇండస్ట్రీ కి పరిచయమైంది. తొలిసినిమా అయ్యినప్పటికీ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో తన పరిధిమేర చక్కగా నటించింది. మిగిలిన నటీనటులు కూడా ఈ చిత్రానికి వెన్నుముక గా నిలిచారు.
చివరిమాట :
ఈ వీకెండ్ లో కాసేపు కాలక్షేపం కోసం వెళ్లే ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది.
నటీనటులు : రాజ్ తరుణ్ , హాసిని సుధీర్, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, సత్య తదితరులు
సంగీతం : గోపి సుందర్
దర్శకుడు : రామ్ భీమన
నిర్మాతలు : డాక్టర్ రమేష్ తేజ్ వత్, ప్రకాష్ తేజ్ వత్
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
రేటింగ్ : 2.5/5