Priyamani : తమిళ నటే అయినా తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న ప్రియమణి.. హిందీలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా తాను నటించిన ఆర్టికల్ 370 మూవీ గురించి పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. నార్త్, సౌత్ అనే తేడాపై స్పందించింది. బాలీవుడ్ హీరోయిన్లంత కాకపోయినా తాము కూడా అందగత్తెలమే అని ఆమె అనడం విశేషం. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. సాధారణంగా నార్త్ వెర్సెస్ సౌత్ అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో బాలీవుడ్ లోనూ సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు దుమ్ము రేపుతుండటంతో క్రమంగా సౌత్ నటీనటులు, డైరెక్టర్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇక్కడి నటీనటులు తరచూ బాలీవుడ్ మూవీస్ లోనూ కనిపిస్తున్నారు. తాజాగా ప్రియమణి కూడా ఆర్టికల్ 370 మూవీలో నటించింది. ఈ సందర్భంగా ఆమె ఈ నార్త్, సౌత్ చర్చపై మాట్లాడింది. బాలీవుడ్ వాళ్లు కాస్త ఫెయిర్ గా ఉంటారన్న మాట నిజమే కానీ.. తాము కూడా ఎవరికీ తక్కువ కాదని ఆమె స్పష్టం చేసింది. “సౌత్ ఇండియా పాత్ర కాబట్టి మీకు ఈ అవకాశం ఇస్తున్నామని కొన్నిసార్లు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు. తొందర్లోనే ఇందులో మార్పు వస్తుందని భావిస్తున్నాను.
మేము సౌత్ ఇండియా వాళ్లమే అయినా.. మేము ఈ భాష (హిందీ)ను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు మేము చాలా అందంగా కూడా ఉంటాం. మా మేని ఛాయ బాలీవుడ్ వాళ్లంత ఫెయిర్ గా ఉండకపోవచ్చు కానీ అది పెద్ద విషయం కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులందరికీ భాష తెలుసు. వాళ్లు అనర్గళంగా మాట్లాడగలరు. గ్రామర్ తప్పిదాలు ఉన్నా భావోద్వేగాలు సరిగ్గా పలికించినంత వరకూ అదేమంత పెద్ద విషయం కాదు. ఇక నార్త్, సౌత్ అనేది ఉండకూడదు. మనమందరం ఎప్పుడూ ఇండియన్ యాక్టర్సే” అని ప్రియమణి స్పష్టం చేసింది.