ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం.. ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్.. రాముడిగా, హీరోయిన్ కృతిసనన్.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, హనుమంతుడిగా సన్నీసింగ్ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ చిత్రం చూడటం కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌కి పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు ఉండటం, రామయణం లాంటి ఇతిహాసం ఆధారంగా సినిమా రూపొందించడంతో భారతీయులంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే 250 కోట్ల వరకు బిజినెస్ చేసింది. భారీ మొత్తం వెచ్చించి ఈ సినిమా ఒటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అఫీషియల్‌గా ఇప్పటికే ఒటీటీ పార్ట్నర్‌ని కన్ఫర్మ్ చేశారు.

తాజాగా ఆదిపురుష్ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు. టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు ఇంతటి రన్‌టైమ్ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి. ఇక సినిమా విషయంలో చిత్ర బృందం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయంలో చిత్ర బృందం, ఈ సినిమాలో భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఇక తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అభిషేక్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.