నిన్న,మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే. ఆమె సినిమా చేసిందంటే కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాట కూడా అప్పట్లో వినిపించింది. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి పూజానే కావాలన్నారంటే ఆమె ఎంత లక్కీ చార్మో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది అగ్ర కథానాయిక పూజాహెగ్డే హిందీలోనూ జోరు పెంచుతోంది. సల్మాన్‌ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో మెరిసిన తర్వాత షాహిద్‌కపూర్‌తో ‘కోయీ శక్’లో నటిస్తోంది. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా తల్లి లతా హెగ్డేతో కలిసి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది.

ఈ సందర్భంగా తల్లీకూతుళ్లిద్దరూ తమ మధ్య ఉన్న అనుబంధం, పూజకి కాబోయే భర్తకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు. ‘పూజ ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుంది’ అనే ప్రశ్నకి బదులిస్తూ.. ‘తనని అన్నిరకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి ఎదురుచూస్తోంది. వివాహ బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉండాలి. ఒకర్నొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం చాలా కష్టం. ఆ బంధం నిలవదు. పూజ చాలా సున్నిత మనస్కురాలు. తన ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి.

అతడు స్ఫూర్తిగా నిలవాలి. కెరీర్‌ని ప్రోత్సహించాలి. అలాంటి అబ్బాయినే తను కోరుకుంటోంది’ అని లత చెప్పుకొచ్చారు. ఆమె మాటలతో ఏకీభవిస్తూనే.. ‘నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి నీవే. నీ కలలన్నీ నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను. నువ్వు నాకు చేసిన ప్రతి పనికీ కృతజ్ఞతలు’ అంటూ తల్లిపై మమకారం చాటుకుంది పూజా హెగ్డే. దీంతో అలాంటి వరుడు దొరకడం కష్టమే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో నటిస్తోంది పూజ.