Pawan Kalyan : తమిళ సినిమాలో తమిళ నటులే నటించాలనీ, ఆ ప్రాంతంలోనే చిత్రీకరణలు జరపాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తప్పుబట్టారు. ‘మంగళవారం జరిగిన ‘బ్రో’ ఆడియో ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు నాదొక విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. అన్నం పెడుతుంది. తమిళంలో కూడా అలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది. తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎదగదు.
ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు. అన్ని భాషలు.. అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష.. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. తమిళ సినిమాల్లో తమిళవాళ్లే నటించాలనే నిబంధను గురించి ఇటీవల తెలిసింది. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’’ అని అన్నారు.
తమిళ చిత్రసీమలో ‘రోజా’, ‘జెంటిల్‌మన్’ వంటి సినిమాలు వచ్చాయంటే అందుకు కారణం నిర్మాత ఏయం రత్నం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతం, కులం, మతం వంటి పరిధులు దాటాలని ఆయన చెప్పుకొచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమ పెద్దది కావడానికి కారణం ఏయం రత్నం అని, ఆయన తెలుగు వాడని పవన్ కళ్యాణ్ వివరించారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికులకు సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించాలని, వాళ్ళకు ఉపాధి దొరకాలని, పరిష్కారం కోసం మరో ఉపాయం ఆలోచించాలని తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.