Ustaad Bhagat Singh Teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో గతంలో విడుదలైన గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబో ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో రాబోతోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అత్యంత హైప్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి ఈరోజు స్పెషల్ టీజర్ విడుదలైంది.

భగత్ బ్లేజ్ అంటూ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను తీసుకొచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ టీజర్‌లో పవన్ యాక్షన్, లుక్, స్వాగ్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌లో తన రాజకీయ పార్టీ జనసేన ఎన్నికల గుర్తు ‘గాజుగ్లాసు’ని హైలైట్ చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి.
ఒక గుడిలో పండుగ జరుగుతున్న సన్నివేశంతో ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క బ్లేజ్ టీజర్ ప్రారంభమవుతుంది.. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి రౌడీలను చితకబాదుతాడు. విలన్ ఓ గ్లాసు చూపించి ‘ఇది నీ రేంజ్’ అంటూ పోలీస్ స్టేషన్‌లో పగలగొట్టాడు. కానీ.. “గ్లాస్ పగిలితే పదునెక్కుద్ది” అంటూ పవర్ స్టార్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ సూపర్ గా ఉంటుంది. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.. గ్లాస్ సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన డైలాగ్ మనసుకు హత్తుకుంది.
మధ్య మధ్యలో యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ఆకట్టుకుంది. ఈ టీజర్ పవన్ కళ్యాణ్ మరియు జనసేన అభిమానులకు ఫుల్ ఫీస్ట్ లాగా సాగింది. ముఖ్యంగా జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్ చుట్టూ డైలాగులు ఉన్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల ప్రణాళికను మేకర్స్ వెల్లడించలేదు.