Panchatantram Review : ఒకే సినిమాలో నలుగురైదుగురి కథలు చూపించడం వెండితెరకు కొత్తేం కాదు. కానీ నాలుగైదు కథలతో ఒక సినిమా చేయడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. ఇలా కొన్ని కథలను కలిపి మూవీగా తెరకెక్కించే పద్ధతిని ఫిల్మ్ భాషలో ఆంథాలజీ అంటారు. రీసెంట్గా ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఆ మధ్య వచ్చిన పిట్టకథలు.. మొన్న రిలీజ్ అయిన మీట్ క్యూట్ ఈ కోవకు చెందినవే.
అయితే ఇప్పటిదాకా ఓటీటీకే పరిమితమైన తెలుగు ఆంథాలజీ సినిమా ఇప్పుడు థియేటర్‌కూ పాకింది. అలా థియేటర్లో రిలీజ్ అయిన తొలి తెలుగు ఆంథాలజీ సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి వంటి ప్రధాన నటీనటులు భాగమైన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ తొలి ప్రయత్నం ఎలా ఉందో తెలుసుకుందామా..?
సినిమా : పంచతంత్రం
నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, తదితరులు
కూర్పు: గ్యారీ బీహెచ్
ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు
సంస్థ: టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక;
విడుదల: 9-12-2022
స్టోరీ ఏంటంటే..: మనం ఏదైనా సాధించాలనుకున్నా.. మన కలలను నెరవేర్చుకోవాలన్నా దాన్ని పలానా వయసులోనే చేయాలనే రూల్ లేదు. మన కెరీర్‌ని ఇరవై యేళ్ల వయసులోనే కాదు.. అరవైల్లోనూ మొదలు పెట్టొచ్చనే ఆలోచన ఉన్న వ్యక్తి వేద వ్యాస్ మూర్తి (బ్రహ్మానందం). కూతురు రోషిణి (స్వాతి)తో కలిసి జీవిస్తుంటాడు.
రిటైర్మెంట్ తర్వాత స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు వెళతాడు. ఎంత పోటీ ఉన్నా సరే, తన అనుభవాన్నంతా రంగరించి కథలు చెప్పడం మొదలుపెడతాడు. మరి ఆ పోటీల్లో నెగ్గారా? ఆ కథల్లో విహారి (నరేష్ అగస్త్య) – సుభాష్ (రాహుల్ విజయ్), లేఖ (శివాత్మిక రాజశేఖర్), రామనాథం (సముద్రఖని), ఆయన భార్య మైత్రి (దివ్యవాణి), శేఖర్ (వికాస్), ఆయన భార్య దేవి (దివ్య శ్రీపాద), చిత్ర అలియాస్ లియా (స్వాతి) జీవితాలు ఏం చెప్పాయో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే: ఇప్పుడు ప్రేక్షకులకు సూపర్ హీరో, వంద మందిని ఒక్కడే చంపగల హీరోల వంటి సినిమాలంటే ముఖం కొట్టేశాయి. కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియెన్స్ జై కొడుతున్నారు. ముఖ్యంగా ఆ కంటెంట్ రియలిస్టిక్‌గా ఉంటేనే ఇష్టపడుతున్నారు. తెరపై చూస్తున్నప్పుడు అరె.. ఇది మన లైఫ్‌లో జరిగిన స్టోరీలాగే ఉందే అని అనిపించిందంటే చాలు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
ఇప్పుడు వచ్చిన పంచతంత్రం కూడా ఈ కోవకు చెందిందే. మన కథలే అనిపించే ఐదు కథల సమాహారం ఈ చిత్రం. నిన్ను కన్నవాళ్లతో నీకు, నీ జీవిత భాగస్వామితో నీకు, నీ ప్రపంచంతో నీకు, నువ్వు కన్నవాళ్లతో నీకు, నీతో నీకుండే కథలే అని ట్రైలర్‌లో చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట ఎవరి జీవితాల్ని వాళ్లకు గుర్తు చేసే సాగే కథలే ఇందులో ఉంటాయి. వేదవ్యాస్ ప్రపంచం పరిచయం అయ్యాక విహారి కథతో పంచతంత్రం కథలు మొదలవుతాయి.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆ యువకుడి సంఘర్షణని ఈ కథతో ఆవిష్కరించారు. ఆరంభ సన్నివేశాలు నత్తనడక సాగుతున్నట్టు అనిపించినా, మిగతా కథల విషయంలో మాత్రం వేగం కనిపించడంతోపాటు భావోద్వేగాలు కూడా బాగా పండాయి. సుభాష్, లేఖ పెళ్లి చూపుల కథ అందంగా, మనసుల్ని హత్తుకునేలా సాగుతుంది. క్రీడలతో పెళ్లి చూపులని ముడిపెడుతూ రాసుకున్న సంభాషణలతోపాటు, సుభాష్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది.
తన బిడ్డల భవిష్యత్తు గురించి కన్నవాళ్లు ఎలా మానసికంగా సతమతమవుతుంటారో, వాళ్ల జీవితాల్ని అది ఎంతగా ప్రభావితం చేస్తుంటుందో మూడో కథతో చెప్పే ప్రయత్నం చేశారు. వాసన వాసన అంటూ నడిచే కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించినా ఈ కథ థ్రిల్‌తోపాటు, భావోద్వేగాల్నీ పంచుతుంది. విరామ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి.
నాలుగో కథలో ఆవిష్కరించిన శేఖర్, దేవిల ప్రపంచం మరింత హృద్యంగా అనిపిస్తుంది. కష్టాలు ఎన్నైనా రానీ.. వాటిని పంచుకోవాలి కానీ, బంధాల్ని తుంచుకోకూడదనే విషయాన్ని అందంగా, మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో ఆవిష్కరించారు. ఐదో కథ చిత్ర అలియాస్ లియా జీవితం నేపథ్యంలో సాగుతుంది. వేదవ్యాస్ నా కూతురు లాంటి కూతురు కథ అంటూ ఈ కథని చెప్పడం మొదలుపెడతాడు.
ఈ కథలో చిన్నపాప, ఉత్తేజ్ పాత్ర కీలకం. భావోద్వేగాలు, డ్రామా, రొమాంటిక్ నేపథ్యం.. ఇలా అన్నీ కలగలిశాయి. తొలి కథ మినహా మిగిలిన ప్రతి కథా ఓ ప్రత్యేకమైన అనుభూతి, అనుభవాన్నీ పంచుతుంది. రుచి, వాసన, దృశ్యం, ధ్వని, స్పర్శతో ముడిపెడుతూ తీసిన ఈ ఐదు కథల్ని వేదవ్యాస్ జీవితంతోనూ ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది.
యాక్టింగ్ ఎలా చేశారంటే: బ్రహ్మానందం అనగానే నవ్వుల్ని గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. కానీ ఇందులోని ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ యాంగిల్లో బ్రహ్మి అందరి మనసూ దోచేస్తాడు. వేదవ్యాస్ పాత్రలో ఆయన నటన సూపర్‌గా ఉంది.
స్వాతి రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తుంది. చిత్ర పాత్రపై ఆమె తనదైన ప్రభావం చూపించారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ జోడీ నటన, వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దివ్య శ్రీపాద – వికాస్, సముద్రఖని – దివ్యవాణి జోడీ, ఉత్తేజ్ నటన ఆకట్టుకుంటుంది. నరేష్ అగస్త్య, శ్రీవిద్య, ఆదర్శ్ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.
సంగీతం, కెమెరా విభాగాల పనితీరు ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ హర్ష పులిపాక పంచతంత్రం కథల్ని ఎంత పరిణతితో రాసుకున్నారో, రాసుకున్న ఆ కథల్ని అంతే స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చారు. కాకపోతే కొన్ని కథల్లో డ్రామా సరిపోలేదు. చాలా సెన్సిటివ్‌గా ఉన్న స్టోరీల్లో ఎమోషన్ కాస్త మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి మంచి సినిమాను తీయాలనుకున్న నిర్మాతల అభిరుచికి హాట్సాఫ్.
కన్‌క్లూజన్ : మన జీవిత కథలే ఈ ‘పంచతంత్రం’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రేటింగ్ : 3/5