ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులే పట్టాలెక్కిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమాను చేయబోతున్నాడు. ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తుల కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా హోంబలే ఫిలింస్ దీన్ని నిర్మించబోతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2024 ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ స్కేల్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ క్రమంలో హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నారని సమాచారం. మొదట మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొణె పేర్లు పరిశీలించిన మేకర్స్ ప్రియాంక చోప్రా వైపు మొగ్గు చూపారట. ఈ గ్లోబల్ బ్యూటీ ఎన్టీఆర్తో రొమాన్స్ చేయటం ఖాయమే అంటున్నారు.
దక్షిణాదిన ఎన్టీఆర్ ఇమేజ్ పరంగా సినిమాకు బిజినెస్ అవుతుంది. ఎలాగూ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి ఆ ఇమేజ్ మీద నార్త్ లో బిజినెస్ నడిచిపోతుంది. ప్రియాంక యాడ్ అయితే ఇతర దేశాల్లో సినిమా మార్కెట్ ను పెంచుకోవాలనేది చిత్ర యూనిట్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో హాట్ టాపిక్ ఏంటి అంటే బడ్జెట్. అసలు ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఓ రేంజ్లో బడ్జెట్ ఉంటుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకి సుమారు రూ.300 కోట్లు ఖర్చు పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ రేంజ్లో బడ్జెట్ పెడుతున్నారంటే సినిమాని భారీగానే ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఇవే కాకుండా.. ఈసారి తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించనున్నారట.