నరేశ్- పవిత్రా లోకేశ్ జంటగా ఎం.ఎస్.రాజు (MS Raju) దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మళ్ళీ పెళ్లి’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఆదివారం ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వేడుకలో నరేశ్ మాట్లాడుతూ సినిమా విజయం పట్ల భావోద్వేగానికి గురయ్యారు. తుది శ్వాస వరకూ నటుడిగానే ఎన్నో విభిన్న పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు. అలాగే, తన స్నేహితుడు శరత్‌బాబును ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము ఎన్ని కష్టాలు పడ్డాం. ఏమి సాధించాం అనేది మా వ్యక్తిగత విషయం. మా గురించి ఎవరైనా ఎన్ని అయినా మాట్లాడుకోవచ్చు. కానీ, మేము వాటిని పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు సాగాలనుకుంటున్నాం. ఇక, ‘కోకిల’ నుంచి శరత్‌బాబుతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా కోసం అడిగినప్పుడు జయసుధ, శరత్‌బాబు ఎలాంటి సందేహం లేకుండా ఓకే అన్నారు. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో. తను చాలా మంచిది. సంతోషంగా ఉండండి’ అని చివరిరోజు షూట్ పూర్తి చేసుకుని వెళ్తూ శరత్‌బాబు నాతో చెప్పారు. ఈ క్షణం ఆయన్ని నేను ఎంతో మిస్ అవుతున్నా. జయసుధ నాకు అక్క వరుస అవుతుంది. కానీ, అమ్మలా ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఈ సినిమాకు ఆమె మరో బలంగా నిలిచారు. మా చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు.
పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. జీవితానికి సంబధించిన సీక్రెట్స్ కి ఎవరూ బయటికి చెప్పరు. కానీ కొన్ని సార్లు సీక్రెట్లు చెప్పాల్సిన అవశ్యత వుంటుంది. ఇది సమాజంలోని కథ అనుకుంటే మేము గెలిచినట్లే. మళ్ళీ పెళ్లి చిత్రాన్ని విమర్శనాత్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. యంఎస్ రాజు గారు చాలా అందమైన చిత్రం తీశారు. ఆయన అనుభవం అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చిత్రం నరేష్ గారి వలనే సాధ్యమైయింది. ఈ చిత్రంలో విజయ కృష్ణ మూవీస్ ని మళ్ళీ ప్రారంభించడం ఆనందంగా వుంది. ఇందులో నా పాత్ర ద్వారా మహిళలు వారి హక్కుల కోసం నిలబడితే ఆనందపడతాను. సమాజం మహిళని గౌరవిస్తే ఆనందంగా పడతాను’’ అన్నారు.