Nagachaitanya : నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. మత్స్యకారుడిగా ఈ చిత్రంలో చైతూ కనిపించనున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. చిత్రీకరణ కంటే ముందే తండేల్ కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తులు చేసింది. కాగా, తాజాగా తండేల్ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. తండేల్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది.

సముద్రం ఒడ్డున ఓడల మధ్య నాగచైతన్య నడుచుకుంటూ వెళుతున్నట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. “సముద్రం మధ్య ఉత్కంఠభరితమైన షెడ్యూల్‍ను తండేల్ టీమ్ మొదలుపెట్టింది. షూటింగ్ జరుగుతోంది” అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే మరిన్ని ఎగ్జైటింగ్ అప్‍డేట్లను ఇస్తామని పేర్కొంది. తండేల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉడిపిలో జరుగుతోంది. మాల్పే పోర్టు సమీపంలో చిత్రీకరణ జరుగుతుండగా.. ఇటీవలే ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మత్స్యకారుడి పాత్రకు తగట్టు నాగ చైతన్య మేకోవర్ అయ్యారు. ఇటీవలే తండేల్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

నాగచైతన్య తండ్రి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు.‘లవ్ స్టోరీ’ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి రెండోసారి తండేల్ మూవీలో హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో తండేల్ రూపొందుతోంది.