Manchu Manoj : ప్రస్తుతం మంచు మనోజ్ ప్రారంభిస్తున్న ‘ఉస్తాద్’ అనే సెలబ్రిటీ గేమ్ షో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సమయంలో రాజకీయాల గురించి తనకు ప్రశ్న ఎదురయ్యింది. అంతే కాకుండా తన భార్య.. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి తన గురించి కూడా ప్రత్యేకంగా అడిగారు. దానికి మంచు మనోజ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. గత ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేశారని గుర్తుచేస్తూ.. తరువాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈసారి ఎటువైపు ఉండబోతున్నారు అంటూ ‘ఉస్తాద్’ ప్రమోషన్స్ సమయంలో మంచు మనోజ్‌ను అడిగారు.

‘‘అప్పుడు కూడా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. మా నాన్నకు సపోర్ట్ చేశాను’’ అంటూ డైరెక్ట్‌గా తాను ఏ పార్టీకి సపోర్ట్ కాదు అని సూటిగా సమాధానమిచ్చాడు మనోజ్. ‘‘ఆ పరిస్థితుల్లో నేను ఆ ఊరిలో ఉన్నాను కాబట్టి నాన్నతో వెళ్లాల్సి వచ్చింది. నేను అయితే మామూలుగా ఏ పార్టీకి, ఏ వ్యక్తులకు సపోర్ట్ కాదు. నేను ఈ పార్టీకి ఓటు వేయండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఏ పార్టీలో అయినా నా ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరిగినవాళ్లు ఉంటే వాళ్లకి వ్యక్తిగతంగా వెళ్లి సపోర్ట్ చేయడమే తప్పా పార్టీకి ఎప్పుడూ స్టాండ్ తీసుకోలేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు.

గత ఎన్నికల సమయంలో భూమా మౌనిక.. మంచు ఫ్యామిలీలోకి ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు మంచు ఇంటి కోడలు అయ్యింది. అదే విషయాన్ని గుర్తుచేస్తూ మౌనిక ఫ్యామిలీ ఎన్నికల్లో ఉంటారు కాబట్టి కనీసం వారికి అయినా సపోర్ట్ చేస్తారా అని మనోజ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘మౌనిక స్టాండ్ తీసుకుంటే తన వెన్నంటే నిలబడతాను. దాంట్లో కూడా డైరెక్ట్‌గా ఏం ఉండను. నాన్నగారు ఎవరికి స్టాండ్ తీసుకుంటారో వాళ్ల ఇష్టం. నా భార్యకు మాత్రమే నేను బాధ్యత వహిస్తాను. అందరితో పోలిస్తే నేను తనకోసమే ఎక్కువగా స్టాండ్ తీసుకోవాలి’’ అంటూ పరోక్షంగా తన భార్య ఏ పార్టీవైపు నిలబడితే.. తాను కూడా ఆ పార్టీకే సపోర్ట్ అని చెప్పాడు మనోజ్.