Mahesh Babu : ఎన్నో వందల సినిమాల్లో హీరో గా నటించి, టాలీవుడ్ కి ఎన్నో కొత్త టెక్నాలిజీలను, జానర్స్ ని పరిచయం చేసి, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ ని అనుభవించిన కృష్ణ గురించి కొత్తగా చెప్పేది ఏముంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయనొక సువర్ణ అధ్యాయం. అలాంటి సూపర్ స్టార్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.

మహేష్ బాబు హీరో అయ్యాక, కృష్ణ హీరో వేషాలు వెయ్యడం మానేసాడు. కథ నచ్చితే అప్పుడప్పుడు హీరో రోల్స్ చేసేవాడు కానీ, ఎక్కువ శాతం ఆయన క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వెయ్యడానికే అమితాసక్తిని చూపేవాడు. మహేష్ బాబు తో కలిసి ఆయన మూడు సినిమాల్లో నటించాడు. అందులో రాజకుమారుడు చిత్రం సూపర్ హిట్ అవ్వగా, వంశీ మరియు టక్కరి దొంగ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

అప్పటి నుండి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. కానీ కృష్ణ ఇతర హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తూ వచ్చాడు. అలా ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో కూడా నటించాల్సింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రని ముందుగా కృష్ణ తో చేయించాలని అనుకున్నాడు డైరెక్టర్ కృష్ణవంశీ. కృష్ణ కూడా ఉత్సాహంగా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర దాదాపుగా హీరో పాత్రతో సమానంగా ఉంటుంది.

అయితే ఈ సినిమా చెయ్యడానికి మహేష్ బాబు ఒప్పుకోలేదు. ఎందుకంటే కృష్ణ కి అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయట. పైగా హీరో తో సమానమైన పాత్ర, రెండు నెలలకు పైగా విరామం లేకుండా డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడం తో మహేష్ ఈ పాత్ర చెయ్యొద్దు అని కృష్ణకి చాలా గట్టిగా చెప్పాడట. కానీ కృష్ణ కి మాత్రం చెయ్యాలని ఆశ ఉంది, నా మాట కాదని ఈ సినిమా చేస్తే మాత్రం నేను మీతో మాట్లాడను అని మహేష్ బలంగా చెప్పడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నాడట కృష్ణ.
