Leo Movie Review : రీసెంట్ సమయం లో సౌత్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రాలలో ఒకటి ‘లియో’. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ , లోకేష్ కనకరాజ్ వంటి టాప్ ఫామ్ ఉన్న యంగ్ డైరెక్టర్ తో ‘మాస్టర్’ చిత్రం తర్వాత జత కట్టడం తో ఈ మూవీ పై అంచనాలు ఈ స్థాయిలో ఏర్పడడానికి కారణం అయ్యింది. పైగా లోకేష్ కనకరాజ్ విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం కావడం వల్ల అంచనాలు ఆకాశాన్ని అంటడానికి కారణం అయ్యింది.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా 188 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండి వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుండా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
పార్తీభాన్ (విజయ్ ) అనే వ్యక్తి కాశ్మీర్ లో ఒక కేఫ్ ని నడుపుతూ తన పెళ్ళాం(త్రిష) మరియు ఇద్దరు పిల్లలతో సుఖం గా జీవిస్తూ ఉంటాడు. అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయం లో అతను నడుపుతున్న కేఫ్ పై కొంతమంది ముఠా దాడులు జరుపుతారు. వాళ్ళు లియో దాస్ (విజయ్) కోసం వెతుకుతూ ఉంటారు. ఆ లియో దాస్ పార్తీభాన్ పోలికలు ఒకేలాగా ఉండడం తో ఆ గ్యాంగ్ మొత్తం పార్తీభాన్ ని లియో దాస్ అని బలంగా నమ్ముతారు. ఇదంతా డ్రగ్స్ మాఫియా నడుపుతున్న ఆంటోనీ దాస్(సంజయ్ దత్) చేయిస్తాడు. అసలు ఈ లియో దాస్ ఎవరు? ఎందుకు ఆంటోనీ దాస్ అతని కోసం వెతుకుతున్నాడు. ఇంతకీ లియో దాస్ మంచోడా చెడ్డోడా?, ఇద్దరు ఒక్కటేనా, లేదా వేరువేరా?, ఇలాంటివి అన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
లోకేష్ కనకరాజ్ సినిమా అంటే ఆడియన్స్ లో ఉండే అంచనాలు వేరు, ప్రతీ సన్నివేశం లో కొత్తదనం, వైవిద్యం కోరుకుంటారు. ఈ సినిమాలో కూడా అదే ఆశించారు ఆడియన్స్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది. చాలా సన్నివేశాలకు లోకేష్ కనకరాజ్ టేకింగ్ కి సలాం కొట్టొచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అలా ఫస్ట్ హాఫ్ ప్రారంభం లో కాస్త స్లో గా అనిపించినా ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తూ మంచి ఎంగేజింగ్ గానే తీసాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అలా సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి కలిగేలా చేసాడు. అలా గ్రాండ్ నోట్ లో ప్రారంభం అవుతుంది సెకండ్ హాఫ్.
కానీ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఓవరాల్ సెకండ్ హాఫ్ చాలా డల్ గా అనిపిస్తాది. ముఖ్యంగా విజయ్ మరియు ఆయన సోదరి మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా బాగా రాసుకొని ఉండొచ్చు. మంచి సత్తా ఉన్న కథని ఇంకా బాగా తీసి ఉండొచ్చు అని అనిపించింది. క్లైమాక్స్ కూడా పర్వాలేదు అనిపించింది. ఓవరాల్ గా వేరే లెవెల్ కి వెళ్లేంత స్కోప్ ఉన్న ఈ సబ్జెక్టు, పర్వాలేదు డీసెంట్ గా ఉంది అనే స్థాయికి స్థిరపడింది. ఇక లోకేష్ కనకారాజ్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక రేంజ్ లో హైప్ తెచ్చారు ఈ సినిమాకి. విక్రమ్ సినిమాలో ఖైదీ చిత్రానికి కనెక్షన్ పర్ఫెక్ట్ గా కుదిరింది. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ లో విక్రమ్ సినిమాకి పెట్టిన కనెక్షన్ అతికించినట్టుగానే అనిపించింది. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.
చివరిమాట :
మితిమీరిన అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్తే బాగా సంతృప్తి చెందుతారు. సెకండ్ హాఫ్ మీద డైరెక్టర్ లోకేష్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ కి ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉండేది.
నటీనటులు : తలపతి విజయ్, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా, సంజయ్ దత్ , అర్జున్ దాస్, తదితరులు .
రచన – దర్శకత్వం : లోకేష్ కనకరాజ్
సంగీతం : అనిరుద్
నిర్మాతలు : లలిత్ కుమార్, జగదీశ్ పళని స్వామి
రేటింగ్ : 2.75/5