Kota Srinivasa Rao : తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో స్వర్గీయ ఎస్ వీ రంగారావు లాంటి మహానటుడు మళ్లీ పుట్టాడేమో అని అనుకుంటూ ఉండేవారు. ఆయన తర్వాత తరం లో ఎంతో మంది గొప్ప నటులు ఇండస్ట్రీ కి వచ్చి ఒక వెలుగు వెలిగారు కానీ, కేవలం కొంతమంది మాత్రమే ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగలం అని నిరూపించుకున్నారు. అలాంటి నటులలో ఒకరు కోట శ్రీనివాస రావు గారు.

ఈయన చెయ్యలేని పాత్ర అంటూ ఏది మిగిలి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో వందల సినిమాల్లో నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరించిన కొత్త శ్రీనివాస రావు గారు, కామెడీ పండించడం లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అంతే కాదు బయట కూడా ఈయనకి ముక్కు సూటి మనిషి అనే పేరు ఉంది.

ఏదైనా మనసుకి అనిపించింది ముఖం మీదనే చెప్పేయడం కోట స్టైల్. మొదటి నుండి ఇదే వ్యక్తిత్వం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే రీసెంట్ గా ఆయన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నేను ఎంతో గొప్ప దర్శకులతో పనిచెయ్యడం నా అదృష్టం. కానీ నేటి తరం దర్శకులు ఎవరో ఒకరిద్దరు తప్పితే విలువలు పాటించడం లేదు. ఆరోజుల్లో దర్శకుల ప్రతిభ చూస్తే ఆశ్చర్యం వేసేది, కానీ ఇప్పటి వారిలో అది కనిపించడం లేదు. ఉన్నవారిలో రాజమౌళి గొప్ప దర్శకుడు, కొంతమంది త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా చెప్తారు కానీ, ఎందుకో నాకు ఆయన అంత పెద్ద గొప్ప దర్శకుడిగా అనిపించలేదు’ అంటూ కోట శ్రీనివాస రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.