Keeda Cola : ‘కీడా కోలా’ మూవీ రివ్యూ!..ఇలాంటి కామెడీ సినిమాని ఇప్పటి వరకు చూసుండరు!

- Advertisement -

నటీనటులు :

తరుణ్ భాస్కర్, చైతన్య రావు, బ్రహ్మానందం, రాజ్ మయూర్, జీవన్ కుమార్, విష్ణు తదితరులు

రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : దగ్గుపాటి రానా
సంగీతం : వివేక్ సాగర్

- Advertisement -

Keeda Cola : చేసిన రెండు మూడు సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ ని ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరో ని చేసి తొలి సక్సెస్ ని ఇచ్చింది ఈయనే. అలాగే ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా మరో టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఈ సినిమాకి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ గా అప్పట్లో ఎబోవ్ యావరేజ్ అయ్యింది కానీ , ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మనకి బోర్ కొట్టిన సమయం లో చూసుకునే సినిమాగా ఇది నిల్చింది. రీసెంట్ గానే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిల్చింది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో కాస్త గ్యాప్ తీసుకొని తెరకెక్కిన చిత్రం ‘కీడా కోలా’. విడుదలకు ముందే ఆసక్తికరమైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను రేపింది ఈ చిత్రం.నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ ని అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

Keeda Cola
Keeda Cola

కథ :

చిన్నతనం లోనే తల్లితండ్రులు పోగొట్టుకున్న వాస్తు (చైతన్య రావు) తన తాతయ్య వరదరాజులు (బ్రహ్మానందం) దగ్గర పెరుగుతూ ఉంటాడు. సాధారణ మెడికల్ రిప్రజెంటర్ గా పని చేసే వాస్తు చాలీ చాలని జీతం తో కుటుంబాన్ని పోషిస్తూ వస్తాడు. అంతే కాదు అతనికి టూరెట్ సిండ్రోం( మాటల్ని సరిగా పలాలేకపోవడం) అనే వ్యాధి చిన్నతనం నుండే ఉంటుంది. ఇది ఆయన తల్లితండ్రుల ముందు చూపు వల్ల వచ్చిన రోగం అన్నమాట. ఆ ముందు చూపు ఏమిటి అనేది సినిమా చూస్తేనే అర్థం అవ్వుద్ది. వాస్తు మరియు వరదరాజులతో పాటుగా లంచం అనే వ్యక్తి కూడా నివసిస్తూ ఉంటాడు. ఇతనిది ఎలా అయినా డబ్బులు బాగా సంపాదించాలి అనే మనస్తత్వం. ఒకరోజు వరదరాజులు ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ ని త్రాగుదాం అని చూస్తే అందులో బొద్దింక కనిపిస్తుంది. దీనిని అడ్డం పెట్టుకొని కూల్ డ్రింక్ షాప్ వినియోగదారుడి నుండి డబ్బులు దండుకోవచ్చు అనే ప్లాన్ వేస్తాడు లంచం. డబ్బులు తనకి కూడా అవసరం కాబట్టి వాస్తు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా కూల్ డ్రింక్ బిల్ ని తీసుకొని షాప్ కి వెళ్తున్న సమయం లో నాయుడు (తరుణ్ భాస్కర్), జీవన్, సికిందర్ గ్యాంగ్ వాస్తు ని కిడ్నాప్ చేస్తారు. వాళ్లకు వాస్తుని కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి?, అసలు ఎవరు ఈ నాయుడు ?, ఇతని ఎంట్రీ వల్ల వాస్తు మరియు లంచం జీవితాలు ఎలా మలుపులు తిరిగాయి?, ఇలాంటి ప్రశ్నలకు సమాదానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

తరుణ్ భాస్కర్ సినిమాల్లో న్యాచురల్ క్లీన్ కామెడీ ని ఆశిస్తారు ఆడియన్స్. అది ఈ సినిమాలో బోలెడంత ఉంది. క్రైమ్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా వాస్తు, లంచం మరియు వరదరాజులు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఈ మూడు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా లో ఉన్న మెయిన్ మైనస్ ఏమిటంటే కథ చాలా చిన్నది. అయ్యినప్పటికీ కూడా తన మార్క్ కామెడీ టైమింగ్ , మరియు క్రిస్పీ టేకింగ్ తో రెండు గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోగానే, ఇంత తొందరగా అయిపోయింది ఏంటి అనే భావన అందరిలో కలుగుతుంది . అలా డిజైన్ చేసాడు స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ పేస్ తగ్గకుండా ఆడియన్స్ ని సీట్స్ నుండి కదలకుండా చేసాడు.

ఇక ప్రధాన పాత్రల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాస్తు పాత్ర పోషించిన చైతన్య రావు ఈ సినిమాలో ఛాన్స్ దొరికినప్పుడల్లా దంచి కొట్టేసాడు. ఈయన గతం లో 31 వెడ్స్ 21 అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించాడు. ఆ తర్వాత వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ కొట్టి మంచి మార్కులు కొట్టేసాడు. ఇక బ్రహ్మానందం కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆయన మార్క్ సింపుల్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించాడు. అలాగే లంచం పాత్రలో నటించిన రాజ్ మయూర్ కూడా అదరగొట్టేసాడు. ఇక ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అయితే కేవలం దర్శకత్వం పరంగా మాత్రమే కాదు, నటుడిగా కూడా దుమ్ము లేపేసాడు. ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇక వివేక్ సాగర్ అందించిన సంగీతం గొప్పగా లేకపోయినప్పటికీ నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశాలకు తగ్గట్టుగా అదరగొట్టేసాడు.

చివరి మాట :

ఓవరాల్ గా యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకునే చిత్రం గా కీడా కోలా చిత్రం నిల్చింది. థియేటర్స్ కి స్నేహితులతో కలిసి టైం పాస్ చేస్తూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు.

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here