Kavya Kalyan : సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఉన్న నటీనటులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నప్పటికి బయటికి మాత్రం తాము సంతోషంగా ఉన్నట్లుగానే కనిపిస్తారు. సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు నానా తిప్పలు పడుతుంటారు. టాలెంట్ ఉన్నప్పటికి అలా ఉన్నావ్, ఇలా ఉన్నావ్ అంటూ వంకలు పెడుతూ అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలు అవహేళన చేసినట్లు పలువురు నటీనటులు బయట పెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇదే బాటలో బలగం సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ తను ఎదుర్కొన్న అవమానం గురించి ఓ కార్యక్రమంలో వెల్లడించింది. దానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నటి కావ్య కళ్యాణ్ రామ్ ఇటీవల తను నటించిన ఉస్తాద్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తాను ఆడిషన్స్‌కు హాజరైనప్పుడు దర్శక నిర్మాతలు తనను హేళన చేశారంటూ తెలిపింది. బొద్దుగా, లావుగా ఉన్నావని ఇలా ఉంటే అవకాశాలు రావని, హీరోయిన్లు స్లిమ్‌గా, అందంగా ఉండాలంటూ బాడీషేమింగ్ చేశారని వెల్లడించింది. కానీ నేను అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నానని చెప్పింది. ఆ వ్యాఖ్యలతో సినిమాలపై ఆశలు వదులుకోలేదని, ఆడిషన్స్‌కు వెళ్లడం కొనసాగించానని కావ్య పేర్కొంది.

కాగా బలగం సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ కావ్యకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఉస్తాద్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, తాజాగా వీటిపై కావ్య ట్వీట్ చేసింది. అలాంటి వార్తలను నమ్మకండి అంటూ వేడుకుంటూ స్పందించింది. అవన్నీ వదంతులు మాత్రమేనని, అలాంటి పరిస్థితులు తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. దర్శకులు తనని బాడీ షేమింగ్ చేశారని తాను ఎక్కడా మాట్లాడలేదని, అవన్నీ, అవాస్తవాలు మాత్రమేనని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి వార్తలు సృష్టించవద్దని కోరుతూ ఓ ట్వీట్ చేశారు.