బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రం తొలిరోజు భారీ కలెక్షన్లను దక్కించుకుంది. గురువారం (సెప్టెంబర్ 7) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం, ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్లను దక్కించుకున్న బాలీవుడ్ చిత్రంగా ‘జవాన్’ రికార్డు సృష్టించడం ఖాయమైంది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంపై ముందు నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి.

దానికి తగ్గట్టుగానే బుకింగ్స్ భారీగా జరిగాయి. దీంతో తొలి రోజు కలెక్షన్లలో కింగ్ ఖాన్ మూవీ జవాన్ సత్తాచాటింది. జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.100 గ్రాస్ కలెక్షన్లను దాటేస్తుందని ఎర్లీ ఎస్టిమేట్‍లలో స్పష్టమైంది. జవాన్ సినిమా మొదటి రోజు దేశంలో రూ.70 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ఎర్లీ ఎస్టిమేట్స్ వచ్చినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. ఇండియాలో బాలీవుడ్ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓపెనింగ్ అని ఆయన ట్వీట్ చేశారు.

ఓపెనింగ్ డే రూ.100 కోట్లను సాధించిన రెండు చిత్రాలు ఉన్న ఏకైక బాలీవుడ్ యాక్టర్‌గా షారుఖ్ నిలిచారని ఆయన పేర్కొన్నారు. జవాన్ తొలి రోజు లెక్కలు శుక్రవారం పక్కాగా వెల్లడికానున్నాయి. షారుఖ్ హీరోగా నటించిన పఠాన్ చిత్రం తొలి రోజు ఇండియాలో రూ.57కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దీన్ని ఇప్పుడు ఆయనే నటించిన జవాన్ దాటేస్తోంది. ఇండియాలోనే జవాన్ సుమారు రూ.75కోట్ల నెట్ సాధిస్తుందని ఎర్లీ ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం రిలీజ్ అయింది.