బాలీవుడ్ స్టార్ కిడ్ Janhvi Kapoor ఎట్టకేలకు టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఎన్నాళ్ల నుంచో ఈ బ్యూటీ తెలుగు సినిమా చేయాలని తపిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ బ్యూటీ కల నెరవేరింది. ఏకంగా గ్లోబర్ స్టార్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇవాళ ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమానికి ఈ బాలీవుడ్ బ్యూటీ కూడా హాజరైంది. ఈ ఈవెంట్ కు జాన్వీ చాలా సంప్రదాయంగా వచ్చింది. లైట్ గ్రీన్ కలర్ శారీలో జాన్వీ మెరిసిపోయింది. స్లీవ్ లెస్ బ్లౌజులో తన ట్రెండీనెస్ ను కాస్త టచ్ చేసింది.

ఆకుపచ్చ చీరలో జాన్వీ తన తల్లి శ్రీదేవిని తలపించింది. చెవికి ఝుంకాలతో చాలా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి కాస్త మోడన్ గా కూడా కనిపించింది. జాన్వీ ట్రెడిషనల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

జాన్వీని చీరకట్టులో చూసిన తెలుగు కుర్రాళ్లు తెగ సంబురపడి పోతున్నారు. శారీలో జాన్వీ చాలా అందంగా కనిపిస్తోందంటూ మురిసిపోతున్నారు. ఎప్పుడూ బోల్డ్ అవతార్ లో కనిపించే జాన్వీ సౌత్ సినిమా ఇండస్ట్రీకి రాగానే.. ఇక్కడి సంప్రదాయానికి తగ్గట్టుగా చీరకట్టులో రావడం చూసి తెగ పొగిడేస్తున్నారు. జాన్వీకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసని కామెంట్లు చేస్తున్నారు.

ఇక జాన్వీ తెలుగు తెరపై కనిపించాలన్న తన కోరిక గురించి ఇంతకుముందు చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండలతో కలిసి నటించాలని ఉందని చాలా సార్లు చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీ తన ఫేవరెట్ తెలుగు హీరో తారక్ అని చెప్పిన విషయం తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ లుక్ ను ఇటీవలే చిత్రబృందం రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమంలో కొరటాల శివ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దర్శకుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, నిర్మాత దిల్ రాజు, కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు పాల్గొన్నారు. జాన్వీ, తారక్ లపై తొలి సీన్ కు రాజమౌళి క్లాప్ కొట్టగా.. ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.