సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో రోబో
ఒకటి. ఈ సినిమాకు ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో ఇండియాలో హైయ్యాస్ట్ బడ్జెట్ తో తీసిన సినిమా రోబో. 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 320 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి అనేక రికార్డులను నెలకొల్పింది. వశీకరన్ క్యారెక్టర్లో మరియు చిట్టి అనే రోబోగా డ్యూయల్ రోల్‌లో రజనీకాంత్ సూపర్బ్ అనిపించాడు.

ఈ సినిమాకు భారీ లాభాలతో పాటు రెండు నేషనల్ అవార్డులు లభించాయి. కొన్నాళ్లకు రోబో సినిమాకు సీక్వెల్‌గా డైరెక్టర్ శంకర్ రోబో 2.0
ను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. రోబో
సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్ కాదట. ఈయన కంటే ముందే ఓ స్టార్ హీరోతో శంకర్ మూవీ స్టార్ట్ చేశారట. కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. అయితే కొంత షూటింగ్ తర్వాత సదరు స్టార్ హీరో రోబో మూవీ నుంచి తప్పుకున్నారట.

ఆయనెవరో కాదు విశ్వనటుడు కమల్ హాసన్. 2000 వ సంవత్సరంలోనే కమల్ హాసన్, ప్రీతి జింటా కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. శంకర్ కొంత షూటింగ్ కూడా తీశాడు. అనుకోకుండా బడ్జెట్ సమస్యలు తలెత్తడంతో చిత్రాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత పదేళ్లకు రజనీతో శంకర్ రోబో సినిమా పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.