లైగర్ ఇచ్చిన ఫ్లాప్ షాక్‌లో ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ Puri Jagannadh తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. జనగణమన కోసం హీరోను వెతికే పనిలో ఉన్నారు. లైగర్ రిలీజ్‌కు ముందు విజయ్ దేవరకొండతో ఈ మూవీ చేస్తానని ప్రకటించిన Puri Jagannadh.. ఆ సినిమా ఇచ్చిన షాక్‌తో విజయ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇక ఈ చిత్రంలో నటించడానికి వేరే టాలీవుడ్ హీరోలు సాహసించకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా బాలీవుడ్‌కు వెళ్లాడు పూరీ. బీ టౌన్ హీరోలతో ఈ సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు షురూ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోస్ రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌లకు ఈ స్టోరీ కూడా వినిపించినట్లు సమాచారం. బీ టౌన్‌లో ఓ హీరో ఆ స్క్రిప్టుకు ఓకే కూడా చెప్పాడట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.
ఇక నిండా నష్టాల్లో మునిగిన పూరీ ప్రస్తుతం తన పాడ్ కాస్ట్ ఛానెల్ పూరీ మ్యూజింగ్స్ పనిలో బిజీ అయ్యాడు. ‘పూరీ మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్‌లకు కొంతకాలం విరామం ఇచ్చిన పూరీ జగన్నాథ్ తాజాగా మళ్లీ ప్రారంభించాడు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్‌లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ (Tadka) గురించి చెప్పాడు. తడ్కా అంటే తాలింపు కాబట్టి వంటల సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారనుకుంటే పొరపాటే. మరి, పూరీ చెప్పిన ఆ తాలింపు వివరాలేంటో చదివేయండి మరి..
‘‘మనం అప్పుడప్పుడు ఏదైనా పనికోసం ఓ మనిషిని మరో మనిషి దగ్గరకు పంపిస్తాం. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది తప్ప మిగిలినవ్నీ చెబుతాడు మనం వెళ్లమని చెప్పిన వ్యక్తి. ఏం జరిగింది? అని అడిగితే.. ‘మంచి రోజులుకావు. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. డబ్బు ఎక్కువవ్వడం వల్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావ్’ అని మనం పంపించిన మనిషి సమాధానం ఇస్తాడు. ఇదంతా కాదు ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే.. ‘డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు’ అని బదులిస్తాడు. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడకి తీసుకొచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు దీనివల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనే దాన్ని గ్రహించాలి. మధ్యవర్తులంటే ఎవరో కాదు మనమే’’
‘‘ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్టే. తడ్కా లేకుండా ఎవరూ మన దగ్గరకు ఏ వంటకాన్నీ తీసుకురారు. మనమంతా పుట్టుకతోనే మంచిగా వండడం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాం. ఐదుసార్లు తాలింపు వేయడం అయ్యాక మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకొస్తాడు. వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. అడిగితే మీ అభిప్రాయాన్ని చెప్పండి.. లేదంటే మానేయండి. ఇప్పుడు మనం ఎంత స్మార్ట్‌గా ఉంటున్నామో తడ్కా అలానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం’’ అని పూరీ జగన్నాథ్ లిజనర్స్‌కు రిక్వెస్ట్ చేశాడు.
పూరీ జగన్నాథ్ సినిమాలెలా ఉన్నా.. పూరీ మ్యూజింగ్స్‌కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాడ్‌కాస్ట్‌లో పూరీ చెప్పే మాటలు రియల్ లైఫ్‌కి చాలా సింక్ అవుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. పూరీ మ్యూజింగ్స్ నుంచి వీడియో వచ్చిందంటే చాలు క్షణాల్లో వినేస్తున్నారు. తమకు నచ్చిన వారికి షేర్ చేస్తున్నారు.