నటీనటులు : మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి , వెన్నెల కిషోర్, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయ్ రామ్, జగపతి బాబు తదితరులు.
రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం : థమన్
నిర్మాత : సూర్య దేవర నాగ వంశీ
బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్
Guntur Kaaram Movie Review : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు, ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం. గతం లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా , అభిమానులు మరియు ప్రేక్షకులకు కాలం గడిచే కొద్దీ క్లాసిక్స్ గా నిలిచాయి. మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘గుంటూరు కారం’ పై అంచనాలు తారాస్థాయికి చేరింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ బాగా ఆకట్టుకున్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :
వైరా వెంకట స్వామి(ప్రకాష్ రాజ్) కూతురు వసుందర గా ఇందులో రమ్యకృష్ణ నటిస్తుంది. వైరా వెంకట స్వామి ఒక మంత్రి. తన కూతురుని సత్యం (జయరాం ) అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోతారు. వీళ్లిద్దరికీ రమణ (మహేష్ బాబు) అనే కొడుకు ఉంటాడు. రమణ ని కూడా చిన్నతనం నుండే కుటుంబానికి దూరంగా ఉంచేస్తుంది వసుందర. అయితే వైరా వెంకట స్వామి మహేష్ బాబు పేరిట ఉన్న క్లెయిమ్స్ ని దొంగతనం చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన సహచరులను కూడా అందుకోసం వాడుతాడు. మహేష్ ఈ వ్యూహాలను అన్నీ ఎదురుకొని తన క్లెయిమ్స్ ని ఎలా కాపుడుకున్నాడు, చివర్లో తన తల్లికి ఎలా దగ్గరయ్యాడు అనేదే సినిమా స్టోరీ.

విశ్లేషణ :
ఈ సినిమా ప్రారంభం లో మహేష్ బాబు ఎంట్రీ సీన్, ఆ తర్వాత వచ్చే టైటిల్ సాంగ్ ఇలా మొదటి 30 నిమిషాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో అనిపించేలా స్క్రీన్ ప్లే ని నడిపించాడు త్రివిక్రమ్. మహేష్ బాబు కూడా అద్భుతమైన ఎనర్జీ మరియు కామెడీ టైమింగ్ తో ఇరగ కుమ్మేసాడు. ఇక సినిమాకి తిరుగులేదు అని అనుకుంటున్న సమయం త్రివిక్రమ్ మరియు థమన్ పోటీ పడి మరీ ఈ సినిమాని నాశనం చెయ్యడానికి తమవంతు కృషి చేసారు. మహేష్ ఎనెర్జిటిక్ పెర్ఫార్మన్స్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు లాగ అయ్యింది. మొదటి 30 నిమిషాల తర్వాత సినిమా పరిస్థితి ఇది. కనీసం సెకండ్ హాఫ్ లో అయినా సినిమా పికప్ అవుతుందేమో అని అభిమానులు ఆశపడ్డారు.

కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు కనికరించలేదు. తన నాసిరకపు స్క్రీన్ ప్లే రైటింగ్ తో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయేలా చేసాడు. అసలు ఎలా ఈ సినిమాని మహేష్ బాబు ఒప్పుకున్నాడు?, కథ చెప్తున్నప్పుడు నిద్రపోయాడా అని అనిపిస్తాది. ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని చివరి దాకా సీరియల్ స్క్రీన్ ప్లే తో నరకం కి స్పెల్లింగ్ రాయించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా సరిగా రాయలేకపోయాడు. ఫైట్ సన్నివేశాలనన్ని చూసేందుకు రోతగా అనిపించాయి. కనీసం ‘అజ్ఞాతవాసి’ చిత్రం లో రెండు మూడు సన్నివేశాలు అయినా బాగా రాసాడు. కానీ ఈ చిత్రం లో ఒక్క సన్నివేశం కూడా సరిగా రాయలేదు. ఈ సినిమాలో ఉన్న ఏకైక పాజిటివ్ ఏదైనా ఉందా అంటే అది మహేష్ బాబు పెర్ఫార్మన్స్ మాత్రమే. సినిమా ని ప్రారంభం నుండి ఎండింగ్ వరకు తన భుజాలపై మోసే ప్రయత్నం చేసాడు. త్రివిక్రమ్ కనీస స్థాయికి డ్యూటీ చేసి ఉన్న ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్ అయ్యేది. ముఖ్యంగా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లో మహేష్ బాబు రెచ్చిపోయాడు అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో నీరసించిపోయిన ఫ్యాన్స్ కి ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట కాస్త జోష్ ని నింపుతుంది.
చివరి మాట :

మహేష్ బాబు కోసం ఒక్కసారి చూడొచ్చు, ఆయన పడిన కష్టానికి కనీసం ఈ సంక్రాంతి సెలవులు వరకు సినిమా సేఫ్ అవుతుంది.
రేటింగ్ : 2.25/5