ఈ ఏడాది ప్రారంభం లో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆయన చేసిన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకొని, కలెక్షన్స్ పరంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బహుశా షారుఖ్ ఖాన్ కూడా ఊహించి ఉండదు.

మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ అంత తేలికగా రాదనీ అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జవాన్ ‘ కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. మొదటి ఆట నుండే పఠాన్ కి మించిన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

షారుఖ్ ఖాన్ కి ఈ స్థాయి వసూళ్లు మన తెలుగు రాష్ట్రాల నుండి రావడం ఇదే తొలిసారి, పఠాన్ చిత్రానికి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ‘జవాన్’ చిత్రానికి ప్రతీ ప్రాంతం లో తెలుగు స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ చిత్రం ‘భోళా శంకర్’ కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా కాలం నుండి కనీస స్థాయి వసూళ్లు కూడా చూడని థియేటర్స్ కూడా నిన్న కళకళలాడిపోయాయి.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, అనగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇది బాలీవుడ్ డబ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇంకెంత వసూళ్లను మన తెలుగు స్టేట్స్ నుండి రాబడుతుందో చూడాలి.