పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh ) లైగర్ ఫ్లాప్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. తమ నెక్స్ట్ మూవీ జనగణమన తన లైగర్ హీరో విజయ్ దేవరకొండతో చేయాలనున్నారు. కానీ లైగర్ రిజల్ట్ చూశాక విజయ్ చేతులెత్తేశాడు. ఇక ఆ మూవీ రిజల్ట్ చూశాక పూరీతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే ప్రస్తుతం పూరీ జనగణమన కోసం హీరోని వెతికే పనిలో పడ్డారు. ఇక సౌత్ లో సెట్ కాదని భావించి.. నార్త్ లో హీరోని వెతుకుతున్నారు. ఇప్పటికే రణ్ వీర్ సింగ్, విక్కీ కౌశల్ కు పూరీ తన స్టోరీ వినిపించినట్లు సమాచారం. వారిలో ఎవరో ఒకరు ఈ సినిమా చేయడం ఖాయమని టాక్.
జనగణమన సినిమా పట్టాలెక్కే వరకు పూరీ తన పాడ్ కాస్ట్ పూరీ మ్యూజింగ్స్ పై ఫోకస్ పెట్టారు. సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ లో ఇన్నాళ్లు బిజీగా ఉన్న ఆయన పాడ్ కాస్ట్ కి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు చేతిలో సినిమాలేవి లేకపోవడంతో కాస్త గ్యాప్ దొరికింది. అందుకే మళ్లీ పాడ్ కాస్ట్ షురూ చేశారు. ఇప్పటికే తడ్కా వంటి ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పూరీ సినిమాల్లో హీరోలు ఎంత ఎనర్జిటిక్ గా.. స్టబ్బర్న్ గా ఉంటారో.. పూరీ పాడ్ కాస్ట్ అంతకు మించిన కిక్కు ఇచ్చేలా ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి పూరీ మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లో పూరీ జగన్నాథ్ లేటెస్ట్ గా వినిపించిన ముచ్చట ఏంటో ఓ సారి చూద్దామా..
మట్టిలో హ్యూమస్ తయారయ్యేందుకు చాలాకాలం పడుతుందని, ఎంతో ఉపయోగకరమైన దాన్ని నాశనం చేయొద్దని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విజ్ఞప్తి చేశారు. ‘పూరీ మ్యూజింగ్స్’ ద్వారా హ్యూమస్ గురించి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘హ్యూమస్ అనేది నలుపు/గోధుమ రంగులో ఉండే సేంద్రీయ పదార్థం. చెట్ల నుంచి రాలిపోయిన ఆకులు, చనిపోయిన జంతువులు, పురుగులు నేలలో కుళ్లిపోయి హ్యూమస్ తయారవుతుంది. చెత్త, వృథా ఆహారం తదితర వాటిని ఓ చోట కుళ్లబెట్టినా హ్యూమస్ వస్తుంది. ఎన్నో చిన్న మొక్కలు దీనిపై ఆధారపడి బతుకుతాయి. హ్యూమస్ అధికంగా ఉన్న నేల దృఢంగా ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్ చాలా అవసరం. అది హ్యూమస్‌లో ఎక్కువగా ఉంటుంది. హ్యూమస్ మొక్కలకు బలాన్ని ఇచ్చి, వ్యాధుల బారినుంచి కాపాడుతుంది’’
‘‘పెంటకుప్పలో పంట పొలాలకు కావాల్సిన నైట్రోజన్, ఫాస్పరస్, సల్ఫర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉత్పన్నమవుతాయి. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం. అయితే, మీరు హ్యూమస్ తయారుచేయాలని నేను ఇది చెప్పడం లేదు.. దాన్ని పాడు చేయకుండా ఉంటారని చెబుతున్నా. చలికాలంలో మనమంతా చలి మంటలు వేసుకుంటాం.
ఆ మంటల వల్ల భూమిలోని హ్యూమస్ నాశనమవుతుంది. అందుకే రోజుకో ప్రాంతంలో కాకుండా ఒకే చోట మంటలు వేసుకోండి. ఫైర్ ప్రూఫ్ షీట్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అవి తీసుకుని, వాటిపైనా మీరు చలిమంట కాచుకోవచ్చు. మట్టిలో హ్యూమస్ తయారయ్యేందుకు చాలాకాలం పడుతుంది. దాన్ని పది నిమిషాల్లో నాశనం చేయొద్దని నా మనవి. హ్యూమస్ అనేది లాటిన్ పదం. భూమి అని అర్థం’’ అని పూరీ జగన్నాథ్ వివరించారు.