జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు సైతం ఇస్రోకు అభినందనలు తెలిపాయి. ఇండియన్స్ అందరూ స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం విఫలమైన ఈ ప్రయోగం మన సైంటిస్టుల పట్టుదల వల్ల ఈరోజు సాకారమై గర్వకారణంగా నిలిచింది ఇదంతా సరే కానీ ఇప్పుడీ అద్భుత ఘటాన్ని సినిమాగా తీస్తారా అనే ప్రశ్న ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో మొదలైపోయింది.

అక్షయ్ కుమార్ ఇలాంటి సంఘటనలు, బయోపిక్కులు తీయడంలో ముందు వరసలో ఉంటాడు. మిషన్ మంగళ్, ప్యాడ్ మ్యాన్, ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్, కేసరి, సామ్రాట్ పృథ్విరాజ్ వగైరాలన్నీ నిజ జీవితాల ఆధారంగా తీసినవే. కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి. ఇప్పుడీ చంద్రయాన్ 3 గురించి తెలిశాక వెంటనే వీటికి కారణం ఎవరు, 41 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎవరెవరు భాగమయ్యారు లాంటివన్నీ రీసెర్చ్ చేసి మరీ రచయితలతో స్క్రిప్ట్ రాయించుకుంటారేమో. ఇతను కాకపోతే దగ్గర్లో ఎవరో ఒకరు చంద్రయాన్ 3ని తెరకెక్కించడం ఖాయం. ఒక ప్రముఖ రాజకీయ పార్టీ వైపు నుంచి ఎలాగూ ఈ తరహా వాటికి మద్దతు పుష్కలంగా ఉంటుందనేది ఇండస్ట్రీలో బహిరంగంగా మాట్లాడుకునే సీక్రెట్.

అలాంటప్పుడు ఇంత గొప్ప విజయాన్ని స్క్రీన్ మీద చూపిస్తామంటే ఖచ్చితంగా సహకారం అందిస్తుంది. అయితే ఇలాంటివి డ్రామా లేకుండా పండించడం కష్టం. తెలుగులో కొన్నేళ్ల క్రితం వరుణ్ తేజ్ తో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇదే తరహాలో అంతరిక్షం తీస్తే ఆశించిన విజయం సాధించలేదు. అందుకే వేరొకరు స్పేస్ కథల జోలికి వెళ్ళలేదు. మరి చంద్రయాన్ తీసే సాహసికుడు ఎవరో చూద్దాం. కొందరైతే మాత్రం ఇలాంటి సాహసాలు రాజమౌళి మాత్రమే చేయగలరని అంటున్నారు.