Akshay Kumar : ఒకప్పుడు నెలకు రెండు సినిమాలు విడుదలయ్యే అక్షయ్ కుమార్ స్పీడ్ అలాగే మెయింటైన్ చేస్తున్నా.. ఆ సినిమా ఫలితాలు మాత్రం చాలా నిరాశాజనకంగా ఉంటున్నాయి. వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ హీరో తలలు పట్టుకుంటున్నాడు. కలెక్షన్ కింగ్ గా బాలీవుడ్ లో పేరుగాంచిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా నష్టాల్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. ఈ కిలాడీకి ప్రజెంట్ అంతా బ్యాడ్ టైం నడుస్తోందని ఇండస్ట్రీలో టాక్.
అక్షయ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హిట్ కోసం ఎదరుచూస్తున్నాడు. తాజాగా ‘సెల్ఫీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలతో విడుదలైన ఈ చిత్రం అక్షయ్ అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే, ఈ సినిమా నిరాశపర్చిన తర్వాత అక్షయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. అదేంటంటే..
‘‘నేను సినిమాల విషయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఒక సమయంలో నేను నటించిన 16 సినిమాలు వరసగా నిరాశపర్చాయి. మరోసారి ఎనిమిది సినిమాలు ఆశించిన మేరకు ఆడలేదు. సినిమా హిట్ అవ్వడంలేదంటే అది నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదంటే వాళ్లు నా నుంచి కొత్తదనం నిండిన కథలను ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతం దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. ఇది కేవలం సినీ పరిశ్రమలోని వారికే కాదు అందరికీ వర్తిస్తుంది. ఒక వ్యాపారంలో ఎప్పుడూ లాభాలే రాకపోవచ్చు. ఒక క్రికెటర్ ప్రతి ఇన్నింగ్స్‌లో శతకం సాధించలేడు. నేను చెప్పేది ఒక్కటే.. సినిమా హిట్ అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే’’ అని అక్షయ్ అన్నాడు.
రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెల్ఫీ’. మలయాళ హిట్ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేగా ఈ చిత్రం తెరకెక్కింది. డ్రైవింగ్ లైసెన్స్ నేపథ్యంలో ఓ హీరో, ఓ మోటార్ సైకిల్ ఇన్‌స్పెక్టర్ మధ్య జరిగే కథతో ఈ చిత్రం సాగుతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో విఫలమైంది.