Bhagavanth Kesari : బాలయ్య బాబు అఖండ, వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత తీసిన సినిమా భగవంత్ కేసరి. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్యకు హ్యాట్రిక్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. అందుకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్లో ఇదే హయ్యస్ట్ అంటున్నారు. భగవంత్ కేసరిలో బాలయ్య భారీ టార్గెట్ తో బరిలోకి దిగాడు. రూ. 66 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ దాటలేడు. ఇది ఇలా ఉంటే సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు కొన్ని కోట్ల నష్టం కలిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య బాబే అందుకు కారణమట. నిజానికి హీరోయిన్ కాజల్-బాలయ్య మీద ‘దంచవే మేనత్త కూతురా’ రీమేక్ సాంగ్ తెరకెక్కించారట. ఈ సాంగ్ ని విడుదలైన వారంతర్వాత సినిమాలో పెట్టాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని డైరెక్టర్ అనిల్ కూడా గతంలో చెప్పారు. వాస్తవానికి ఈ సినిమాలో కమర్షియల్ సాంగ్స్ లేవు. కథ రీత్యా ఆ తరహా పాటలు పెట్టలేదని అనిల్ అన్నాడు. బాలయ్య అంటేనే మాస్. ఫ్యాన్స్ ని బాగా నచ్చేది కూడా ఆయనలోని మాసిజం. దానిని దృష్టిలో పెట్టుకొని ఒక మాస్ సాంగ్ సిద్ధం చేశామని అది దసరా రోజు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. కాకపోతే ప్రస్తుతం ఈ ఆలోచన పూర్తిగా విరమించుకున్నట్లు తెలుస్తోంది. కథకు ఈ సాంగ్ ఏ మాత్రం నప్పదని.. ఆ సాంగ్ పెట్టడం వలన సినిమాకు ప్లస్ కాకపోగా మైనస్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే దంచవే మేనత్త కూతురా సాంగ్ సినిమాలో పెట్ట కూడదని అనుకున్నారట. కాకపోతే ఈ సాంగ్ చిత్రీకరణకు నిర్మాతలు రూ. 3.5 కోట్లు ఖర్చు చేశారట. ఇప్పుడు ఈ మొత్తం డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందంటున్నారు.