ఇటీవల కాలం లో భారీ బడ్జెట్ సినిమాలకంటే చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్నాయి. బడా నిర్మాతలు కూడా ఈమధ్య తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాని నిర్మించి థియేటర్స్ లోకి వదులుతున్నారు. అలా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిన్న చిత్రం ‘బలగం’. ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకి జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించాడు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు, వాళ్ళు అనుసరించే సంప్రదాయాలు మరియు కట్టుబాట్లను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వేణు, తాను చూపించాలి అనుకున్నది కళ్ళకి కట్టినట్టు వెండితెర మీద ఆవిష్కరించాడు. ఫలితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రెండు మూడు అంతర్జాతీయ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది.అలాంటి ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ నిన్నతో ముగిసింది. క్లోసింగ్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
తెలంగాణ గ్రామీణ సంస్కృతి మీద తీసిన చిత్రం కాబట్టి ఈ చిత్రానికి తెలంగాణాలో వసూళ్ల వర్షం కురిసింది. 50 రోజుల కేంద్రాలు కూడా ఈ ప్రాంతం లో బాగానే వచ్చాయి. మిగిలిన ప్రాంతాలలో మంచి వసూళ్లే వచ్చాయి కానీ, తెలంగాణ లో వచ్చిన వసూళ్లతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పాలి. ఈ చిత్రం క్లోసింగ్ లో 12 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అందులో 10 కోట్ల రూపాయిలు తెలంగాణ ప్రాంతం నుండే వచ్చిందట. మిగిలినదంతా ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక మరియు ఓవర్సీస్ నుండి వచ్చాయి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా , ఇంతటి సెన్సేషన్ సృష్టిస్తుందని బహుశా ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు మరియు డైరెక్టర్ వేణు కూడా ఊహించి ఉండరు. ఒక్కోసారి అన్నీ అలా కలిసి వస్తాయంతే.