చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అందుకుంది బలగం సినిమా. అప్పటివరకు కమెడియన్గా అందరినీ అలరించిన వేణు ఒక్కసారిగా ఈ సినిమా డైరెక్ట్ చేసి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు. పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాలో నటించిన ఒక వ్యక్తి చనిపోయినట్లుగా సినిమా దర్శకుడు వేణు ఎల్దండి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో ఊరికి సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం కన్నుమూసినట్లుగా ఆయన వెల్లడించారు. ‘’నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి , మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి, బలగం కథ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను, ఆరోజు కల్లు, గుడాలు తెప్పించాడు నా కోసం’’ అని వేణు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సైతం ఈ సందర్భంగా వేణు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మించారు. పలువురు నెటిజన్లు సైతం నర్సింగం మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. నర్సింగం మృతికి గల కారణాన్ని వేణు వెల్లడించలేదు. అనారోగ్యం కారణంగానే నర్సింగం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. కుటుంబ విలువలు ఇతివృత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ‘బలగం’ పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నర్సింగంతోపాటు మరికొందరు కళాకారులకు వేణు అవకాశం కల్పించి, వారికి గుర్తింపు తీసుకొచ్చారు.