అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి హిట్ లేదు. వరుసగా మూడు సినిమాలు ప్లాపులే.. దీంతో నాలుగో సినిమా మిస్టర్ మజ్ను హిట్ అయినా పెద్దగా పేరు రాలేదు. దీంతో భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అసలు ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా రాలేదు. అయితే రిలీజ్‌కు ముందే శాటిలైట్, ఓటీటీ రైట్స్ అమ్ముకోవడంతో నిర్మాత కొంత బయటపడ్డారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా విడుదల తర్వాత నిర్మాతే స్వయంగా సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూట్ కి వెళ్లామని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే జూన్ లోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నా ఏజెంట్ ఇంకా ఓటీటీలో ప్రసారం కాలేదు. ఓటీటీ వెర్షన్‌ను కొంత ట్రిమ్ చేసి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కూడా.. అయినా ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. తాజాగా దీనిపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై మాట్లాడుతూ… అసలు రీ-ఎడిట్ జరగడం లేదని చెప్పేశారు.

ఓటీటీ కోసం కొత్తగా ఎడిటింగ్ ఎక్కడి నుంచి చేస్తారు.. మేం ఇచ్చిన కంటెంటే ఎడిట్ చేయాలి కదా? రష్ ఇవ్వం కదా ? అలాంటప్పుడు కొత్తగా ఏం ఎడిటింగ్ చేస్తారని ప్రశ్నించారు. ఏజెంట్ సినిమా ఇంకా ఎందుకు ఓటీటీలోకి రాలేదో తనకు తెలియదన్నాడు. సినిమాను అమ్మేశానని.. అది ఎప్పుడు ? ఓటీటీలోకి వస్తుందో తనకు సంబంధం లేదన్నారు. ఏదేమైనా ఈ మాటలు అఖిల్ పరువు నిజంగానే తీసేసినట్లయ్యింది. ఏజెంట్ సినిమా అఖిల్‌కు భారీ అవమానాలను తెచ్చిపెట్టింది.