టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో చూపిన నటనకు అతనికి ఈ అవార్డు వరించింది. ఈ సినిమాలో గంధపు చెక్కల వర్కర్‌గా, స్మగ్లర్‌గా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అల్లు అర్జున్. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టాడు. తగ్గేదే లే.. అనే మేనరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇరువురి ఆత్మీయత అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. అందరూ కరతాళ ధ్వనులతో అల్లు అర్జున్, సుకుమార్ లను అభినందించారు.
ఇక కొద్దిసేపటి క్రితమే భారత ప్రభుత్వం 69 వ జాతీయ అవార్డులని ప్రకటించింది. ఊహించినట్లుగానే తెలుగు సినిమా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో పెర్ఫామెన్స్ కి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం చేసుకున్నాడు. దీనితో అల్లు కాంపౌండ్ లో సంబరాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పంచుకుంది.