Allari Naresh : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అతికొద్ది మంది నటుల్లో అల్లరి నరేశ్ ఒకరు. ‘అల్లరి’ సినిమాతో టాలీవుడ్ రంగంలో అడుగు పెట్టి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అయితే కొంత కాలంగా కామెడీ చిత్రాలకు దూరం అయి.. సీరియస్ పాత్రలున్న చిత్రాలను చేస్తున్నారు. హాస్య నటుడి నుంచి విలక్షన నటుడిగా మారిపోయారు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ ఒక్కటి అడక్కు అనే మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అల్లరి నరేష్ మార్క్ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా తెరకెక్కడంతో ఆయన ఖాతాలో మరో భారీ హిట్ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన అభిమానులకు కంటనీరు తెప్పిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో తన తండ్రి ఇవీవీ సత్యనారాయణ చనిపోయిన తర్వాత ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. నాంది సినిమా కరోనా సమయంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందని నరేష్ పేర్కొన్నారు. జంబ లకిడి పంబ సినిమాను రీమేక్ చేస్తారా అంటే నేను చేయనని చెప్పానని ఆయన తెలిపారు. అలాంటి సినిమాను తీయాలనుకుంటే చెడగొట్టకుండా తీయాలని నరేష్ చెప్పుకొచ్చారు.
అహ నా పెళ్లంట టైటిల్ ను రామానాయుడు పర్మీషన్ తీసుకుని ఫిక్స్ చేశామని ఆయన తెలిపారు. సినిమాకు అదే టైటిల్ బాగుంటుందని అనిపిస్తే ఆ టైటిల్ ఉపయోగించుకోవడంలో తప్పు లేదన్నారు. నాన్నతో నేను ప్రతి విషయం మాట్లాడేవాడినని.. నాన్న ఫ్రెండ్లీగా ఉండేవారని ఆయన తెలిపారు. తప్పు చేసినా చెప్పే స్వేచ్ఛను నాన్న ఇచ్చారని అల్లరి నరేష్ వెల్లడించారు. ఇండస్ట్రీలో 1000 మందిలో ఒక్కరే సక్సెస్ అవుతారని ఆయన చెబుతుండే వారని.. అమ్మ మొహమాటం లేకుండా సినిమాల విషయంలో అభిప్రాయం వెల్లడిస్తారని చెప్పారు. నాన్న చనిపోయిన తర్వాత నేను కొన్ని విషయాలలో మారానన్నారు. నాన్న మరణం తర్వాత బాధ్యతలు నాపై పెరిగాయన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఏడాది పాటు సైలెంట్ అయ్యానని నరేష్ తెలిపారు. వయస్సుతో పాటు కొంత మెచ్యూరిటీ వచ్చిందన్నారు. అల్లరి నరేష్ చెప్పిన విషయాలు నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.