రామాయణం నాటకం వేసినా.. రామాయణంపై సినిమా తీసినా.. ఆ ప్రక్రియలో చాలా కష్టాలు ఎదురవుతాయని పెద్దలంటారు. మేం ఆదిపురుష్ సినిమా చేస్తున్నప్పుడు అలాంటి కష్టాలు చాలా చూశాం. అన్ని అడ్డంకులు ఎదుర్కొని చివరకు ఇక్కడి వరకు వచ్చాం. త్వరలోనే థియేటర్లలలో సందడి చేస్తాం. ఇవి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న మాటలు. నిజంగానే ప్రభాస్ చెప్పినట్టు ఆదిపురుష్ సినిమాకు అడుగడుగునా అడ్డంకులే.
ముందు సీత పాత్ర కోసం వేట.. ఆ తర్వాత ప్రభాస్ డేట్స్.. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేస్తే.. విపరీతమైన ట్రోలింగ్.. వీఎఫ్ఎక్స్ బాగాలేవని.. బొమ్మల సినిమాలాగా ఉందంటూ.. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడోనన్న నెగిటివిటీ.. ఇలా ఆది నుంచి ఈ సినిమాకు కష్టాలే. ఇక అన్నింటినీ తట్టుకుని.. ఎదురొడ్డి.. చివరకు ప్రేక్షకులకు నచ్చినట్టుగా తీర్చిదిద్దారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి ప్రేక్షకులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అలా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆదిపురుష్ టీమ్.. ఎట్టకేలకు ప్రేక్షకులు ఆదరిస్తారన్న ఓ నమ్మకానికి వచ్చింది. ప్రేక్షకులు కూడా ట్రైలర్ రిలీజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసి ఈ సినిమాపై కాస్త అంచనాలు పెంచేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా బృందానికి మరో కష్టం వచ్చింది. అదే లీక్ కష్టం. రేపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతున్న ఆదిపురుష్ సినిమా HD ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయింది. ఈ చిత్రంలో కీలక సీన్లన్నీ ఇప్పుడు ఆన్లైన్లో పలు వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ విషయం తెలిసి మేకర్స్ షాకవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సీన్స్‌ను ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ లీకుల వెనుక ఉన్నది ఎవరో మాత్రం ఇంకా తెలిసి రాలేదు. మూవీ టీమ్‌కు సంబంధించిన వాళ్లే లీక్ చేసి ఉంటారా అని నిర్మాతలు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తున్నామని.. లీక్ చేసిన వారిపై చాలా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మేకర్స్.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ ప్రివ్యూ షో కొంతమంది సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా షో వేశారు. దీనికి అద్భుతమైన రివ్యూ వచ్చింది, కచ్చితంగా ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులకు కూడా ఈ చిత్రం తెగ నచ్చేస్తుందని, 3D వెర్షన్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు ఇండియా మొత్తం ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజే 130 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.