ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాలు సినిమాపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి డైలాగ్స్ విషయంపై ఓ జాతీయ చానెల్ లో మాట్లాడుతూ.. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన భక్తుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘‘హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడడు. తాత్వికంగా మాట్లాడడు. ఆయన భగవంతుడు కాదు.. భక్తుడు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడు. అంతేకానీ దేవుడు కాదు’’ అని అన్నారు. మనోజ్ శుక్లా అంతటితో ఆగలేదు.. ‘‘హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయన్ను మనం దేవుడిని చేశాం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్థించుకున్నారు. ఈయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు అక్కడ పంచ్ డైలాగులు చెప్పే సన్నివేశం ఒకటుంది. ఫక్తు ఫ్యాక్షన్ మూవీలో డైలాగులు చెప్పినట్టు హనుమంతుడితో ఆ మాటలు పలికించారు దర్శకుడు. రాముడు, సీత పాత్రల చిత్రీకరణపై వచ్చిన వివాదాలకంటే.. హనుమంతుడు పలికిన ఆ పంచ్ డైలాగులపైనే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల ఆదిపురుష్ సినిమాలో సంభాషణలు మారుస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. అయితే రచయిత మాత్రం తనను తాను సమర్థించుకునే ప్రయత్నాల్లో మరోసారి చిక్కుల్లో పడ్డారు. హనుమంతుడికి పంచ్ డైలాగులు ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పే క్రమంలో ఆయన అసలు దేవుడే కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.