స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడటం ఇలా కొన్ని పరిస్థితులు ఆమెను మానసికంగా కృంగదీశాయి. ఇప్పుడు మయోసిటిస్ వ్యాధి నుండి కోలుకొని మళ్లీ ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా వుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పక్కన ‘ఖుషి’ సినిమా షూటింగ్ బిజీగా ఉంది. మరోపక్క ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్ కూడా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కథానాయకుడు. ఇలా బిజీబిజీగా కాలం గడుపుతున్న సమంత తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తనకు మయోసిటిస్ వ్యాధి సోకి సంవత్సరం అయిన కారణంగా అప్పటి రోజులను గుర్తుతెచ్చుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగత, వృత్తిపరమైన పరాజయాలపై తాను ఆత్మపరిశీలన చేసుకున్నానని చెప్పారు. పరిస్థితులు మెరుగుపరచమంటూ తాను భగవంతుడిని పూజించానని, ధైర్యాన్ని ఇవ్వమని కోరుకున్నానని సమంత చెప్పారు. ప్రస్తుతం సెర్బియాలో ఉన్న సామ్ తాజాగా ఓ ప్రార్థనామందిరానికి వెళ్లి, పూజలు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తన జీవితం ఎలా సాగిందో గుర్తుచేసుకున్నారు.
వ్యాధిని (మయోసైటిస్‌ను ఉద్దేశిస్తూ) నిర్ధారించి, బలవంతంగా కొత్త సాధారణ జీవితంలోకి అడుగుపెట్టి నేటికి ఏడాది అవుతోంది. శారీరకంగా ఎన్నో పోరాటాలు చేశాను. ఆహారపు అలవాట్ల విషయంలోనూ ఇష్టమైన వాటిని వదులుకున్నా. ఇంకొన్నింటిని కొత్తగా ప్రారంభించాను. వ్యక్తిగతంగానే కాక వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకున్నాను.
పరిస్థితులను మెరుగుపరచమని కోరుతూ దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశాను. విలువైన బహుమతులు, ఆశీస్సులు ఇవ్వమని ఎప్పుడూ నేను కోరలేదు. కేవలం, ధైర్యాన్ని, ప్రశాంతతను అందించమని దేవుడికి పూజలు చేశాను. అన్ని సమయాల్లో మనం అనుకున్న విధంగా అన్నీ జరగవని ఈ ఏడాది నాకు తెలిసింది. కొన్నిసార్లు గొప్ప విజయాలు అక్కర్లేదు కానీ పరిస్థితి నుంచి బయటకు అడుగుపెట్టడం కూడా ఒక విజయమే. చాలామంది క్లిష్టమైన పరిస్థితులతో ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. నేను మీ కోసం కూడా ప్రార్థనలు చేస్తాను” అని సమంత రాసుకొచ్చారు.