Manjummel Boys : లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సంగీతం ఓ అద్భుతం. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆయన పాట వింటే వెంటనే రిలీఫ్ అవుతుంది. ఇప్పటికీ తన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎందుకోగానీ ఆయన ఈ మధ్య వరుస షాక్‌లు ఇస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా ప్రొడ్యూసర్లకు ఇళయరాజా ఇటీవల లీగల్ నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన మ్యూజిక్ ట్రాక్‌ని ఉపయోగించారంటూ ఆయన ఆరోపించారు. తాజాగా అదే కారణంతో మరో సినిమాకి కూడా తాజాగా ఆయన షాక్ ఇచ్చారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రానికి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ క్లాసిక్ మూవీ ‘గుణ’లో పాటను వాడేసుకున్నారు. “కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే” అనే ఈ పాటను మూవీ మొదట్లో అలానే క్లైమాక్స్‌లో ఉపయోగించింది చిత్ర బృందం. సినిమా సక్సెస్‌కు ఈ పాట కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థకి ఇళయరాజా లాయర్ నోటీసులు పంపించారు.
“కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు ఉంటాయి. కనుక ఈ పాటను ఉపయోగించుకోవాలంటే తగిన పరిహారం చెల్లించాలి. లేకుంటే కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా భావించాల్సి వస్తుంది. ఇందుకు చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటాం” అంటూ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ‘గుణ’ సినిమా ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకున్న మ్యూజిక్ కంపెనీ నుంచి మంజుమ్మల్ బాయ్స్ చిత్ర మేకర్స్ పర్మీషన్ తీసుకున్నారు. అంతేకాకుండా మ్యూజిక్ రైట్స్ కూడా కొనుగోలు చేశారు. అలానే సినిమా ప్రారంభంలో ఇళయరాజా, కమల్ హాసన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ క్రెడిట్స్ కూడా ఇచ్చారు. ఇన్ని చేసినా ఇళయరాజా ఇలా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా సినిమా రిలీజై రూ.250 కోట్లు వసూలు చేసిన తర్వాత, ఓటీటీలో కూడా రిలీజై భారీ స్పందన వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి ఇళయరాజా నోటీసులు పంపడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ నోటీసులపై మంజుమ్మల్ బాయ్స్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.