Kamal Hasan : విశ్వనటుడు కమల్ హాసన్ కు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస ఫ్లాపులతో సతమవుతున్న సమయంలో విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి. ప్రస్తుతం కమల్ హాసన్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా భారతీయుడు 2 సినిమా పైనే ఉంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్, ప్రభాస్ తో కలిసి కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.
ఇలాంటి సమయంలో విశ్వనటుడు కమల్ హాసన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ప్రముఖ నిర్మాతలు లింగుసామి, సుభాష్ చంద్రబోస్ ఈ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రం కోసం కమల్ హాసన్, లింగుసామి, సుభాష్ కలిసి పని చేశారు. ఆ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కమల్ హాసన్ వారితో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం.
దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్తో మరో సినిమా చేసి గత సినిమా నష్టాన్ని భర్తీ చేస్తానని కమల్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే హామీ ఇచ్చినప్పటికీ కూడా కమల్ హాసన్ తొమ్మిదేళ్లుగా తమతో ఎలాంటి సినిమా చేయలేదని వారు ఆరోపించారు. తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని లింగుసామి అన్నారు. ఈ నష్టాల గురించి అలాగే మరో కొత్త సినిమా నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో సినిమా చేసేందుకు ఆయన సిద్ధంగా లేరని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో మాత్రమే కమల్ హాసన్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.