Chiranjeevi Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తోంది. ఈ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులను విపరితంగా ఆలరిస్తున్న ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో కలెక్షన్లలో దూసుకెళుతోంది.

ఈ తరుణంలో టిల్లు స్క్వేర్ మూవీ టీమ్‍ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సీక్వెల్‍కు అంచనాలను అందుకోవడం చాలా కష్టమని, అయితే దీన్ని సక్సెస్‍ఫుల్‍గా టిల్లు స్క్వేర్ టీమ్ సాధించిందని చిరంజీవి ప్రశంసించారు. “టిల్లు స్క్వేర్ సినిమా చూశా. టిల్లు 1 (డీజే టిల్లు) నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి సిద్దును ఓసారి ఇంటికి పిలిపించుకున్నా.సిద్ధు అంటే ఇంట్లో అందరికీ చాలా ఫేవర్.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా చేశాడు. చూశాను. వావ్.. నాకు చాలాచాలా నచ్చింది. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా అంచనాలను అందుకోవడం చాలా కష్టం. ఆ అరుదైన ఫీట్‍ను డైరెక్టర్ మల్లిక్ రామ్, వంశీ టీమ్ అంతా కలిసి సక్సెస్‍ఫుల్‍గా చేయగలిగారు” అని చిరంజీవి అన్నారు. ఉత్కంఠ, నవ్వులు, సరదాతో తాను టిల్లు స్క్వేర్ మూవీని ఎంతో ఎంజాయ్ చేశానని చిరంజీవి చెప్పారు. దీని కోసం సిద్ధు ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో తనకు తెలుసునని చిరూ చెప్పారు. నటనతో పాటు స్క్రిప్ట్ కూడా అద్భుతంగా చేశారని సిద్ధును అభినందించారు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రం అని చిరంజీవి చెప్పారు.