Murali Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా పిలవబడే అతి తక్కువమందిలో ఒకరు మురళీ మోహన్. హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన చూసిన విజయాలు మామూలివి కావు. ‘జగమే మాయ’ అనే సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పరిచయమైన మురళీ మోహన్, ఆ తర్వాత నేరము శిక్ష, రాధమ్మ పెళ్లి ఇలా ఒక్కటా రెండా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇండస్ట్రీ లోకి ఆయన వచ్చి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తి అయ్యిందట. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ‘మురళీ మోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్సెలెన్స్’ పేరిట ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి మురళీమోహన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను చిన్నతనం లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి వీరాభిమానిని, కానీ మా ఇంట్లో బంధువులంతా మురళి మోహన్ అభిమానులు. వాళ్ళు నన్ను ఎన్టీఆర్ సినిమాలకంటే ఎక్కువగా మురళీమోహన్ సినిమాలకే తీసుకెళ్లేవారు. వాళ్ళ కారణంగా ఎన్టీఆర్ సినిమాని కేవలం ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం దొరికితే, మురళి మోహన్ సినిమాలు ఏకంగా రెండు మూడు సార్లు చూసేవాడిని. మా ఊర్లో లేడీస్ లో మురళీమోహన్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే నేను చిన్నతనం లో ఉన్నప్పుడు మురళీ మోహన్ అంటే నాకు చాలా కోపం ఉండేది. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలను కూడా పక్కన పెట్టి మురళీ మోహన్ సినిమాలకు తీసుకెళ్లడం వల్ల ఆ కోపం ఉండేది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇంకా అయన మాట్లాడుతూ మురళీ మోహన్ గారు 25 సినిమాలను నిర్మించాడని, అందులో 23 హిట్ అయ్యాయి అని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.