Rajendra Prasad ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకు పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి. తన కెరియర్ ప్రారంభంలో నటుడు రాజేంద్రప్రసాద్‌తో వరుసపెట్టి సినిమాలు చేసారు. అయితే ‘మాయలోడు; సినిమా విషయంలో రాజేంద్రప్రసాద్ నుండి తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. తాను దర్శకుడు అవ్వడానికి కారణం రాజేంద్రప్రసాదే అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.
అయితే ‘మాయలోడు’ సినిమా టైమ్‌లో తనను చాలా ఇబ్బందులకు గురి చేసారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా ఆ సినిమాలో ‘చినుకు చినుకు అందెలతో’ పాట విషయంలో డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. సౌందర్య డేట్స్ ఇచ్చారని రిక్వెస్ట్ చేసినా.. ఆ డేట్స్‌కి నేను చేయాలా? అని రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా మాట్లాడారట. డబ్బింగ్ డేట్స్ విషయంలో సైతం ఇబ్బందికి గురి చేసారట. రాజేంద్రప్రసాద్ పాట చేయనని చెప్పడంతో బాబు మోహన్‌కు ఆ ఆఫర్ ఇచ్చారట.
ఆ పాట షూటింగ్ మొదలు పెడుతున్న సమయంలో రాజేంద్రప్రసాద్ మనిషి వచ్చి రాజేంద్రప్రసాద్ పాట చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినా ఇచ్చిన మాట ప్రకారం బాబు మోహన్‌తో ఆ పాట పూర్తి చేసామని.. ఆ పాటకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. సినిమా సూపర్ హిట్ అయ్యిందంటూ అప్పటి అనుభవాలు షేర్ చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబోలో చాలానే సినిమాలు వచ్చాయి. కొబ్బరి బొండాం మూవీతో మొదలుపెడితే నంబర్ వన్, యమలీల, శుభలగ్నం, ఘటోత్కచుడు, మావి చిగురు, ఎగిరే పావురమా, పెళ్లి పీటలు, ప్రేమకు వేళాయెరా ఇలా ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తీశారు. 2023 లో ఆయన తీసిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది.