Poonam Pandey : బాలీవుడ్ నటి, టీవీ స్టార్, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే తాను ఇలా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) తన స్టైల్లో స్పందించారు. దృష్టి ఆకర్షించేందుకు ఎంచుకున్న పద్దతి వల్ల కొన్ని విమర్శలు ఎదురైనా.. పూనమ్ పాండే ఉద్దేశం మాత్రం మంచిదేనని రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ అంశంపై అంతటా చర్చ జరుగుతోందని ట్వీట్ చేశారు. తనలాగే తన మనసు కూడా అందమైనదంటూ పూనమ్‌ను ఆర్జీవీ పొగిడారు.
“అందరి దృష్టిని తిప్పుకునేందుకు నువ్వు పాటించిన పద్ధతి వల్ల కొంత విమర్శలు రావొచ్చు. కానీ ఈ పుకారు వల్ల నువ్వు సాధించిన దాన్ని.. నీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఇప్పుడు సర్వైకర్ క్యాన్సర్ పట్ల చర్చ అంతటా ట్రెండింగ్‌లో ఉంది. నీలాగే నీ మనసు కూడా చాలా అందమైనది. నువ్వు చాలా కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు మాత్రం ఎంతకు తెగించావు పూనమ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.