Dhanya Balakrishna : నటి ధన్య బాలకృష్ణ తాజాగా ‘లాల్ సలాం’ మూవీ టీం, తమిళ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరింది. 12 ఏళ్ల క్రితం తమిళనాడుపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వివాదస్పదం అయ్యాయి. దీంతో ఆమెపై తమిళనాట వ్యతిరేకత మొదలైంది. దీని ప్రభావం ఇప్పుడు లాల్ సలాం సినిమాపై పడటంతో దిగొచ్చిన ధన్య ధన్య బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలాం. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుంది. 12 ఏళ్ల క్రితం ధన్య తమిళనాడును ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో తమిళనాడు ప్రజలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.
దీంతో ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది చూసి కొందరు ‘తమిళ ప్రజలను కించపరిచేల ఆమాట్లాడిన ధన్య బాలకృష్ణను సినిమాలో ఎలా తీసుకున్నారు’ అంటూ ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు. ‘ధన్య నటించిన లాల్ సలాం సినిమా మేము చూడం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఆ స్క్రీన్ షాట్‌పై స్పందించిన ధన్య ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తమిళంలో ఓ నోట్ షేర్ చేసింది.
‘‘కొద్ది రోజులుగా నా పేరుపై వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ నాది కాదు. నేను తమిళనాడును ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్టుగా అందులో ఉంది. అది నేను పెట్టింది కాదు. ఎవరో నా పేరుపై ఏడిట్ చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇది నిజం. నాకు తిండి పెడుతున్న సినీ పరిశ్రమపై ప్రమాణం చేసి చెబుతున్నా. నన్ను ట్రోల్ చేయడానికి కొందరు కావాలనే దాన్ని సృష్టించారు. ఎవరో నాపై కావాలని చేస్తున్న కుట్ర ఇది. 12 ఏళ్ల క్రితమే దీనిపై నేను క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. తమిళ సినిమాతోనే నా సినిమా కెరీర్ మొదలైంది. అలాంటి ఇండస్ట్రీపై, ఇక్కడి ప్రజలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. ఇక్కడ నాకున్న అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది. అందుకే ఈ రాష్ట్రం గురించి ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడలేదు. ఒక నటిగా, మహిళగా నేను ఎప్పుడూ ఒకరిని నొప్పించేలా వ్యవహరించలేదు. తమిళంలో నేను మూడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను. కానీ ఎక్కడా కూడా ఆ పోస్ట్ ప్రస్తావన రాలేదు. ఎందుకంటే అది నేను చేసింది కాదు కాబట్టే. కానీ, ఆ స్క్రిట్ షాట్ వల్ల తమిళ ప్రజలు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి’’ అని చెప్పుకొచ్చింది.