Prashanth Varma : సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. తక్కువ బడ్జెట్‌తో విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటాయి. కోట్లాది వసూళ్లను రాబట్టి మేకర్స్‌ని లాభాల బాటలో నడిపిస్తుంటాయి. తాజాగా హనుమాన్ టీమ్ అలాంటి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి సీజన్‌లో అతి చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అనూహ్యమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.275 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరనుంది.
ఈ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ ఫేట్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చిన్న దర్శకుల జాబితాలో ఉన్న ప్రశాంత్ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారాడు. అంతేకాదు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చేందుకు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆయన సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కాకుండా వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చేందుకు కొందరు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
హనుమాన్ తర్వాత 100,200 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయమని నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చిందని తెలిపారు. హనుమాన్ సినిమా చూసిన ఓ ఎన్నారై నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలలో ఇలాంటి సినిమా చేస్తానంటే రూ.1000కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అంటూ చెప్పుకొచ్చారని.. కానీ స్వతహాగా నాకు బడ్జెట్ కంటే.. ఇచ్చిన బడ్జెట్‌కు మించిన క్వాలిటీ చూపించడమే ముఖ్యం. బడ్జెట్‌లో సినిమా తీసే డైరెక్టర్ నేను కాదు ఆ విషయం మొదట్లోనే నేను నిర్మాతలకు చెప్పేస్తాను.
నేను రూ.10 కోట్లతో సినిమా తీస్తే.. రూ.50 కోట్ల సినిమాలను ప్రదర్శించడం అలవాటైంది. రూ.40 కోట్లతో తీస్తే రూ.150 కోట్ల సినిమాల్లో చూపిస్తారు. మార్కెట్‌ను బేరీజు వేసుకుని సినిమాలు తెరకెక్కిస్తున్నారని ప్రశాంత్ వర్మ వివరించారు. రాజమౌళికి కూడా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల ఆఫర్ రాలేదు. అయితే ప్రశాంత్ వర్మకు ఒక్క సినిమాతో ఆ రేంజ్ లో ఆఫర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రశాంత్ వర్మ సినిమాని ఇంత భారీ బడ్జెట్ తో తీస్తే కచ్చితంగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.