Guntur Karam : గుంటూరు కారం సినిమా గురించి ఈ మధ్యకాలంలో ఎలాంటి టాక్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది. మహేష్ బాబు నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మాస్ యాక్షన్, డ్యాన్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. గుంటూరు కారం సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత స్ట్రీమ్ చేసేందుకు చిత్ర బృందంతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు కారం సినిమా ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందో అనే ఊహాగానాలు వస్తున్నాయి.
గుంటూరు కారం సినిమా ఫిబ్రవరి రెండో వారంలో నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 9న ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆ తేదీన కుదరకపోతే ఫిబ్రవరి 16 నాటికి గుంటూరు కారం ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ యాక్షన్, మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది గుంటూరు కారం సినిమా. మహేష్ బాబు రమణ అనే ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేశాడు. ఫైట్స్, మాస్ డ్యాన్స్‌లతో సూపర్‌స్టార్ ఈలలు వేయించాడు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. రమ్యకృష్ణ, జయరామ్, జగపతి బాబు, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గుంటూరు కారం సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.200 కోట్లకు పైగా చేరినట్లు చిత్ర బృందం వెల్లడించింది.