Bramhastra : 2022 ఏడాది బాలీవుడ్ కు ఏమాత్రం కలిసిరాలేదు. పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయినా ఒకటో రెండో సినిమాలు తప్ప బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీస్.. క్రిటిక్స్ మెచ్చిన చిత్రాలు ఎక్కువగా లేవు. కొంతమంది నిర్మాతలు.. హీరో-డైరెక్టర్ల కాంబోను చూసి కంటెంట్ ను పట్టించుకోకుండా కోట్ల రూపాయలు నష్టపోయారు. తర్వాత తలలు పట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
అయితే ఈ పరిస్థితి కోట్ల రూపాయల బాక్సాఫీస్ వసూల్ చేసిన నిర్మాతకు కూడా వచ్చిందట. గతేడాది బాలీవుడ్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టిన సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా వసూళ్ల పరంగా పాజిటివ్ గానే ఉన్నా.. నిర్మాత కరణ్ జోహర్ కు మాత్రం రాత్రిళ్లు నిద్ర పట్టకుండా చేసిందట.
2022 బాలీవుడ్ ను ఫెయిల్ చేసింది. ఓవైపు వరుసగా భారీ చిత్రాలు డిజాస్టర్లుగా మిగులుతుంటే మరోవైపు బ్రహ్మాస్త్ర లాంటి భారీ బడ్జెట్ సినిమా కోసం వెర్రిగా డబ్బును ఖర్చు చేశాడు కరణ్ జోహార్. ఒక నిర్మాతగా అతడు దర్శకుడిని నమ్మి ప్రయోగం చేశాడు. అది సక్సెసా ఫెయిల్యూరా? అన్నది అటుంచితే అతడు వెర్రి ఆలోచనలతో నిద్ర పట్టక చివరికి నిద్రమాత్రలు మింగాడట.
తాజా ఇంటర్వ్యూలో బ్రహ్మాస్త్ర నిర్మాణంలోని రిస్కీ అంశాల గురించి మాట్లాడుతూ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తనకు నిద్రలేని రాత్రులు ఎదురయ్యాయని తెలిపాడు. ప్రతి రాత్రి అతడు నిద్రపట్టేందుకు మాత్రలు వేసుకునే స్థాయికి దిగజారాడట. ఇదంతా మాస్టర్స్ యూనియన్ పోడ్ కాస్ట్ లో కరణ్ చెప్పాడు.
`బిజినెస్ ఆఫ్ బాలీవుడ్` అనే టాపిక్ గురించి కరణ్ పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ విభిన్న మార్కెటింగ్ కాన్సెప్ట్ లను బాగా అర్థం చేసుకోవడానికి కేస్ స్టడీగా సిఫార్సు చేసే చిత్రాన్ని సూచించమని కరణ్ జోహార్ ని అడిగారు. ఇటీవల మీరు పెద్ద రిస్క్ తీసుకున్న చిత్రం ఏదీ? అని ప్రశ్నించగా కరణ్ వెంటనే `బ్రహ్మాస్త్ర` అని చెప్పాడు.
‘పెద్ద పెట్టుబడులతో తీసిన భారీ సినిమా ఇది. అయాన్ ముఖర్జీ సినిమా మేకింగ్ కి ఇంకా కొత్తవాడే కావడంతో చుట్టూ ఉన్నవారందరిపైనా ఒత్తిడి ఉండేది. నేను ప్రతి రాత్రి ఒక నిద్ర మాత్ర మింగాను. ప్రశంసలు వచ్చినా.. విమర్శలు వచ్చినా.. అభిప్రాయాలు ఎలా ఉన్నా వాటిని అంగీకరించేందుకు సిద్ధంగా లేను. మొదటి సారి నేను చాలా డిఫెన్సివ్ గా ఉన్నాను కాబట్టి “మీకు నచ్చితే చెప్పండి.. లేకపోతే నేను ఎవరి అభిప్రాయాల్ని తెలుసుకోవాలనుకోను అని అనిపించింది. చాలా భయాందోళనకు గురయ్యాను కాబట్టి డిఫెన్స్ లో పడిపోయాను“ అని అన్నాడు. నమ్మకంతో నిర్మించాను కాబట్టే డబ్బు సంపాదించగలిగానని’ అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.