Bahubali : టాలీవుడ్ లెజెండ్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు ఇటు టీవీలోనో లేక సోషల్ మీడియాలోనో ఆయన కామెడీ సీన్స్, మీమ్స్ రూపంలోనో తప్పకుండా చూస్తూనే ఉంటాం. వెయ్యికు పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు బ్రహ్మానందం. పద్మశ్రీ అవార్డుతో పాటు, నంది, ఫిలిమ్ పేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను దక్కించుకున్న బ్రహ్మీకి ప్రపంచ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది అభిమానులున్నారు. ఏ కమెడియన్‌కు లేని ఫ్యాన్ బేస్ కేవలం బ్రహ్మానందానికే సొంతం.
ఇక సోషల్ మీడియాలో మీమ్స్ కంటెంట్ మొదలైన తరువాత బ్రహ్మానందాన్ని మీమ్ గార్డ్ గా కూడా పూజిస్తున్నారు. అలాంటి బ్రహ్మానందాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన కామెంట్స్ తో అవమానించారంటూ ఆయన అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి పీవీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓటమి పాలవడం కాంగ్రెస్ విజయం సాధించడం పై ట్విట్ ద్వారా స్పందించాడు. వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకపోతే.. బాహుబలిని, బ్రహ్మానందాన్ని.. జననేతను, జోకర్ని చేస్తారు ఓటర్ మహాశయులు.. సర్వేజనా సుఖినోభవంతు అంటూ రాసుకొచ్చాడు.
ఆయన ఉద్దేశంలో మంచి ఏదో.. చెడు ఏదో తెలియకుండా తెలంగాణ ఓటర్లు బీఆర్‌ఎస్‌ను ఓడించారని. కాకపోతే అక్కడ వాపుకి బలుపుకి తేడా తెలుసుకోకుండా.. బాహుబలిని, బ్రహ్మానందాన్ని.. జననేతను జోకర్ని చేస్తారు అంటూ పోల్చారు పివిఆర్. ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ.. దానిలోకి బ్రహ్మానందం లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని లాగడం అభిమానులకు నచ్చలేదు. బాహుబలి.. బ్రహ్మానందం కంటే గొప్పవాడా.. బ్రహ్మానందం ఓ మహత్తర వ్యక్తి, మహానటుడు.. మీ ప్రాస కోసం ఆయనను కించపరుస్తారా.. అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా.. బ్రహ్మానందం గారు తక్కువ వారు కాదు, ఆయన విద్వత్తు ముందు బాహుబలి కూడా దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.