Actor Nani : ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ , రష్మిక ఫొటోలు ప్రదర్శించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈవెంట్ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ నెటిజన్లు తప్పుబట్టారు. ఈ వివాదంపై నటుడు నాని తాజాగా స్పందించారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన ఆయా విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ ఫొటో గురించి మాట్లాడుతూ..

‘‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫొటో చూసి మేము కూడా షాకయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఇక (విజయ్ దేవరకొండ, రష్మికను ఉద్దేశించి) మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకు కూడా తెలుసు. ఆ చర్య వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతోపాటు ‘హాయ్ నాన్న’ టీమ్ నుంచి క్షమాపణలు చెబుతున్నాం’’ అన్నారు.


అలాగే మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. ‘‘ మృణాల్ ఠాకూర్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నారనడంలో వాస్తవం లేదు. ప్రమోషన్స్, వరుస షూట్స్‌తో ఆమె ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొన్నిరోజులు ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఇకపై ప్రతి ఈవెంట్‌లో ఆమె పాల్గొంటారు. నా గత చిత్రాలను యూఎస్ ఆడియన్స్ బాగా ఆదరించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పి.. సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నా. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ను అక్కడ ప్రమోట్ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.