Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలో దాదాపు 120మంది అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాటు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమ వ్యవహారం నడిపి అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు, అల్లు ఫ్యామిలీ అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం ఆదివారం (నవంబర్ 5) హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ లో సినీ, రాజకీయ ప్రముఖులు దాదాపు 1000మందికి పైగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే వరుణ్, లావణ్యల పెళ్లికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. వరుణ్, లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో ప్రసారం కానుందని, ఇందుకోసం ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ రూ.10 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా దీనిపై తాజాగా వరుణ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. వరుణ్, లావణ్య వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్ని అబద్ధం. ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దంటూ సూచించారు. ఈ మేరకు వరుణ్ టీం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. తద్వారా వీరి పెళ్లి ఓటీటీ రైట్స్ రూ.10 కోట్లకు నెట్ ఫ్లిక్స్ పొందడం అనేది పచ్చి అబద్ధం అని వెల్లడయింది. ప్రస్తుతం వీరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.