బిగ్ బాస్ సీజన్ 7 ముందు నుండే అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని చాలా హైప్ క్రియేట్ చేశారు. అందుకే అస్త్రాలను గెలుచుకోవాలని, అలా అయితేనే హౌజ్‌మేట్స్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ కూడా ముందు నుండే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి వారంలో పవర్ అస్త్రా అనే ఒక అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్. ఇప్పుడు తాజాగా మరో రెండు అస్త్రాలను సొంతం చేసకునే పనిలో పడ్డారు కంటెస్టెంట్స్.

రణధీర, మహాబలి టీమ్స్ మధ్య జరిగిన మొదటి ఛాలెంజ్.. ‘పుల్ రాజా పుల్’. ఈ ఛాలెంజ్‌లో రెండు టీమ్స్ నుంచి నలుగురు, నలుగురు సభ్యులు వచ్చి మధ్యలో ఉన్న లాగ్‌ను తమవైపు లాగే ప్రయత్నం చేయాలి. ఈ ఛాలెంజ్‌ను వారు మూడుసార్లు ఆడాలి. చివరిగా గెలిచిన టీమ్‌కు మాయాస్త్రానికి సంబంధించిన కీ దొరుకుతుంది. రణధీర టీమ్ నుంచి ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్‌దీప్, షకీలా రంగంలోకి దిగారు. మహాబలి టీమ్ నుంచి టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ వచ్చారు. ఛాలెంజ్‌లో మూడుసార్లు రణధీర టీమే విజయం సాధించింది.

మొదటి ఛాలెంజ్‌లోనే మహాబలి సైడ్ ఉన్న కర్ర విరిగిపోవడంతో వారి పట్టు జారిపోయింది అని టీమ్ సభ్యులు తెలిపారు. ఇక మూడో ఛాలెంజ్ సమయానికి మహాబలి టీమ్ సైడ్ ఉన్న మ్యాట్ పూర్తిగా జారిపోవడంతో, వారు గట్టిగా నిలబడలేక కింద పడిపోయారు. అప్పుడు రణధీర టీమ్‌కు వారిని ఓడించడం సులభంగా మారింది. ఇదే విషయాన్ని సంచాలకుడికి అర్థమయ్యేలా చెప్పడానికి మహాబలి టీమ్ ప్రయత్నించింది. కానీ సందీప్ వినిపించుకోలేదు. రణధీర టీమ్‌ను విజేతలుగా ప్రకటించి, మాయాస్త్రానికి సంబంధించిన తాళంచెవిని ఆ టీమ్ సభ్యులకు అందించాడు.