చిత్రసీమలో అతి తక్కువ టైములో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. సమంత కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్ తన సినిమాల ఎంపికపై మాట్లాడారు.

బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న ‘లైగర్’ సహా తాను ఎంచుకున్న కథలన్నీ అద్భుతమైనవని చెప్పుకొచ్చారు. కానీ, భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని, అనుకున్న ప్రణాళికను సరిగా అమలు చేయలేకపోవడం వల్లే అవి ఫ్లాప్ అయ్యాయని అన్నారు. ‘‘నాకు తెలుసు ప్రేక్షకులు ఈ స్టేట్మెంట్ను అంగీకరించరు. నిజాయతీగా చెప్పాలంటే నేను ఎంచుకున్న ప్రతి కథ అద్భుతమైనదే. కానీ, అనుకున్న ప్రణాళిక ప్రకారం సినిమాను తీయడంలో జరిగిన తప్పిదం కారణంగా అవి ఫ్లాప్ అయ్యాయి. ఉదాహరణకు స్నేహితుల మధ్య జరిగిన సరదా సందర్భం లేదా ఏదైనా జోక్‌ను ఇతరులకు చెప్పేటప్పుడు సరిగా వ్యక్తపరచలేకపోతే దానికి అర్థం ఉండదు. ‘లైగర్’, ‘నోటా,’ ‘డియర్ కామ్రేడ్’ విషయంలో అదే జరిగింది. ప్రచార కార్యక్రమాలతో సహా నేనేదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నా.

భారీగా ఉండే కథలనే ఎంచుకోవాలని అనుకున్నా, అది కుదరడం లేదు. నేను నటించే ప్రతి సినిమా విజయం సాధించాలని నా అభిమానులు, సన్నిహితులు కోరుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదే సమయంలో సినిమా వ్యాపార పరంగా నాపై ఒత్తిడి ఉంటుంది. నాకూ సొంత థియేటర్ ఉంది. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అయితే, ఎలాంటి ప్రభావం ఉంటుందో నాకు తెలుసు’’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తున్న విజయ్..ఇటీవలే మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు.